ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తూ హమాస్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళను గాజాకి తిరిగి వెళ్లాలని ఇజ్రాయెల్ పోలీసులు ఆదేశిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. గాజాకి తిరిగివెళ్లాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇజ్రాయెల్ పోలీసులు చదువుతుండగా, తాను పాలస్తీనాకు తిరిగి వెళ్లనని మహిళ లబోదిబోమనీ ఏడుస్తున్న దృశ్యాలంటూ ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తూ హమాస్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక మహిళను ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి గాజాకి పంపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.
ఫాక్ట్ (నిజం): ఇజ్రాయెల్ దేశం ఉగ్రవాదులుగా భావించే సంస్థలకు సానుకూలంగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారనే ఆరోపణపై ఇజ్రాయెల్ భద్రతా అధికారులు వీడియోలోని మహిళను అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్ పౌరసత్వం పొందిన పాలస్తీనాకు చెందిన ఈ మహిళను ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే సందేహాలపై ప్రశ్నించడానికి అరెస్ట్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు వీడియోలో తెలిపారు. ఆమెను తిరిగి గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ అధికారులు ఈ వీడియోలో ఎక్కడా తెలుపలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Al Jazeera’ వార్తా సంస్థ 09 నవంబర్ 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఇజ్రాయెల్ పౌరసత్వం పొందిన పాలస్తీనాకు చెందిన మహిళను, ఉగ్రవాదసంస్థలకు సానుకూలంగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారనే ఆరోపణపై, ఇజ్రాయెల్ భద్రతా అధికారులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలంటూ ఈ వీడియోలో తెలిపారు. ఇజ్రాయెల్ దేశంలోని నహ్ఫ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సానుకూలంగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టారనే అభియోగంపై మిమల్ని అరెస్ట్ చేస్తున్నామని ఇజ్రాయెల్ భద్రతా అధికారి పేర్కొన్న వెంటనే, మహిళ, “లేదు.. లేదు.. అధి అసంభవం. దేవుడి సాక్షిగా తెలుపుతున్నాను. నేను ఇజ్రాయెల్‌కు విజయం ప్రసాధించాలని దేవుడిని కోరుతూ అది పెట్టాను”, అని అన్నట్టు తెలిపింది. ఉగ్రవాదసంస్థలతో మీకు సంబంధాలు ఉన్నాయనే సందేహాలపై మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అధికారి పేర్కొన్న వెంటనే ఆ మహిళ, “లేదు..లేదు..” అని ఏడిచింది. వీడియోలోని మహిళను, ఆమె భర్తను పోలీసు అధికారులు తరువాత అరెస్ట్ చేశారు. ఈ మహిళను తిరిగి గాజాకు పంపిస్తున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు ఈ వీడియోలో ఎక్కడా తెలుపలేదు. ఈ ఘటనకు సంబంధించి అనేక వార్తా సంస్థలు ఆర్టికల్స్ మరియు వీడియోలను పబ్లిష్ చేశాయి.
ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ఆమోదించిన కొత్త బిల్లులో, ఉగ్రవాదసంస్థలకు సంబంధించిన పబ్లికేషన్లు లేదా మరే ఇతర సమాచారాన్ని సోషల్ మీడియా లేదా మరే ఇతర మాధ్యమాల ద్వారా క్రమంగా వినియోగించడాన్ని నేరంగా పరిగణించింది. ఈ నేరం కింద అత్యధికంగా ఒక సంవత్సరం శిక్ష విధించబడుతుంది. ఈ కొత్త చట్టం కింద అనేకమంది పాలస్తీనాకు చెందిన వ్యక్తులను తమ దేశంలో ఉద్యోగాల నుండి, యూనివర్సిటీలు, కాలేజీల నుండి బహిష్కరించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కానీ, అరెస్ట్ చేసిన వారిని తిరిగి పాలస్తీనాకు పంపిస్తున్నట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.
చివరగా, ఈ వీడియోలోను పాలస్తీనా మహిళను ఉగ్రవాదులకు సానుకూలంగా వాట్సాప్ స్టేటస్ పెట్టిందనే ఆరోపణపై ఇజ్రాయెల్ పోలీసులు ఆమెను తిరిగి గాజాకు వెళ్ళమని ఆదేశించలేదు.