భయంకరమైన సుడిగాలులు కెనడా దేశం టొరంటో నగరంలోని విమానాశ్రయాన్ని చుట్టుముడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ వీడియోని చైనా నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కెనడా టొరంటో నగరంలో వీచిన భయంకరమైన సుడిగాలుల వీడియోని చైనా నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న సుడిగాలి దృశ్యాలు ‘Into the Storm’ అనే హాలీవుడ్ చిత్రం లోనివి. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించింది, నిజ జీవితంలో చోటుచేసుకుంది కాదు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఈ వీడియోని ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోలోని కొన్ని దృశ్యాలని చూపిస్తున్న ఒక వీడియోని హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ‘Warner Bros. Pictures’ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ‘Into the Storm’ అనే హాలీవుడ్ చిత్రంలోనివని ‘Warner Bros. Pictures’ ఈ వీడియో వివరణలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న మరికొన్ని దృశ్యాలని ‘Vidimovie’ అనే ఆన్లైన్ వెబ్సైటులో దొరికాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా ‘Into the Storm’ అనే చిత్రంలోనివే అని ఈ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో గురించిన మరింత సమాచారం కోసం వెతకగా, విమానాలు గాలిలో ఎగురుతున్న అవే దృశ్యాలు ‘Into the Storm’ హాలీవుడ్ చిత్ర ట్రైలర్ లో కనిపిస్తున్నట్టు తెలిసింది. ‘Into the Storm’ చిత్రంలోని ఈ సుడిగాలి దృశ్యాలని ఎడిట్ చేస్తూ షేర్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఇదివరకు, కెనడా దేశంలో పలు సార్లు సుడిగాలులు చోటుచేసుకున్న మాట వాస్తవం. వాటికి సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులోని వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించినవి, నిజ జీవితంలో చోటుచేసుకుంది కాదు.
నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వారు టొర్నాడోలకు సంబంధించి పబ్లిష్ చేసిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పోస్టులోని వీడియోని ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. ఇదివరకు, పోస్టులో వీడియోని ఇదే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ‘Snopes’ న్యూస్ సంస్థ ఆ వీడియో గురించి స్పష్టతనిస్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ‘Into the Storm’ అనే హాలీవుడ్ చిత్రంలోనివని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ‘Into the Storm’ హాలీవుడ్ చిత్రంలోని దృశ్యాలని కెనడా టొరంటో నగరంలో వీచిన భయంకరమైన సుడిగాలుల దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.