Fake News, Telugu
 

అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్స్ వాడకాన్ని నియంత్రించే రూల్స్ ని 2005లో సుప్రీంకోర్టు సమర్థించింది

0

‘2005లోనే సుప్రీమ్ కోర్టు మసీదులలో లౌడ్ స్పీకర్లను నిషేదించింది, కాని అమలు చేసే దమ్ము ప్రభుత్వాలకూ, అడిగే దమ్ము మనకూ లేదని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2005లోనే సుప్రీమ్ కోర్టు మసీదులలో లౌడ్ స్పీకర్లను నిషేదించింది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ‘నాయిస్ పొల్యూషన్ (కంట్రోల్ అండ్ రేగులేషన్) రూల్స్’ ప్రకారం కేవలం మసీదులలో మాత్రమే కాకుండా అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్ వాడకూడదు. 2005లో సుప్రీంకోర్టు లౌడ్ స్పీకర్ల నియంత్రణకి సంబంధించిన పిటిషన్ పై స్పందిస్తూ ఈ రూల్స్ ని సమర్దించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఎన్విరాన్మెంట్ (ప్రొటెక్షన్) ఆక్ట్, 1986 కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2000లో నాయిస్ పొల్యూషన్ (కంట్రోల్ అండ్ రేగులేషన్) రూల్స్ ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ లోని సెక్షన్ 5 లో లౌడ్ స్పీకర్స్ వాడకానికి సంబంధించి పరిమితులను పేర్కొన్నారు. ఈ రూల్స్ లోని కొన్ని  ముఖ్య నిబంధనలు కింద చూడొచ్చు.

  • సంబంధిత ప్రభుత్వ అధికారి నుండి వ్రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ ఉపయోగించకూడదు. అలాగే రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్స్ ని ఉపయోగించకూడదు.
  • ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో 15 రోజుల వరకు పరిమిత వ్యవధిలో మాత్రమే ఏదైనా మతపరమైన లేదా పండుగ సందర్భాలలో రాత్రి 10 నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య లౌడ్ స్పీకర్లను ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించవచ్చు.
  • మతపరమైన ప్రదేశాలతో పాటు బహిరంగ ప్రదేశాలలో ఆ పరిసర శబ్ద ప్రమాణాల కన్నా లేదా 75 dB(A) లలో తక్కువ స్థాయిని పరిగణలోకి తీసుకొని ఈ స్థాయి కన్నా 10 dB(A) పెరగకుండా చూసుకోవాలి.

ఈ రూల్స్ కేవలం మసీదులలో మాత్రమే కాకుండా అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్ వాడకూడదని నిర్దేశిస్తుంది.

ఐతే 2005లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నియంత్రించడానికి తీసుకొచ్చిన ఈ చట్టాల అమలుకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం రూపొందించిన రూల్స్ లో 15 రోజులు లౌడ్ స్పీకర్స్ వాడుకోవానికి ఇచ్చిన సడలింపుని సమర్దిస్తూ ఈ రూల్ కి ఎటువంటి మినహాయింపును (రోజుల సంఖ్యను పెంచడం లేదా వ్యవధిని రెండు గంటలకు మించి అనుమతించడం) ఇవ్వకూడదని అభిప్రాయపడింది. ఐతే ఈ రూల్ కేవలం మసీదులకు మాత్రమే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ప్రదేశాలకు వర్తిస్తుంది.

అలాగే 2015లో మసీదులలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్ వాడుతున్న విషయమై బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందిస్తూ, అన్ని మతాలకు చెందిన మత ప్రదేశాలలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లని తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన ఆదేశాన్నిచ్చింది.

చివరగా, అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్స్ వాడకాన్ని నియంత్రించే రూల్స్ ని 2005లో సుప్రీం కోర్టు సమర్థించింది.

Share.

About Author

Comments are closed.

scroll