‘Indian Oil-Adani Gas’ అనే పేరుతో ఉన్న ఒక పెట్రోల్ బంక్ ఫోటోని షేర్ చేసి, Indian Oil Corporation Limited (IOCL) సంస్థని భారత ప్రభుత్వం అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అమ్మేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అంబానీ, అదాని లకు అమ్మేస్తున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత ప్రభుత్వం Indian Oil Corporation Limited (IOCL) సంస్థని అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అమ్మేసింది.
ఫాక్ట్ (నిజం): ‘Indian Oil-Adani Gas Private Limited (IOAGPL)’ అనే జాయింట్ వెంచర్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), అదాని గ్యాస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 2013లో ప్రారంభించింది. ఈ జాయింట్ వెంచర్ ని 04 అక్టోబర్ 2013 నాడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. అంతేకాదు, IOCL సంస్థ అదాని గ్యాస్ తోపాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీల జాయింట్ వెంచర్స్ లో భాగస్వామిగా పనిచేస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వెబ్సైటులో వెతికితే, ‘Indian Oil-Adani Gas Private Limited (IOAGPL)’ అనే జాయింట్ వెంచర్ ని IOCL సంస్థ, అదాని గ్యాస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 2013లో ప్రారంభించిందని తెలిసింది. IOCL సంస్థ Lubrizol ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ICICI బ్యాంకు తో సహా మరికొన్ని ప్రైవేటు కంపెనీల జాయింట్ వెంచర్స్ లలో భాగస్వామిగా ఉన్నట్టు తెలిసింది.
IOCL సంస్థ, అదాని గ్యాస్ లిమిటెడ్ తో చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ యొక్క పూర్తి వివరాల కోసం వెతికితే, ‘Indian Oil-Adani Gas Private Limited’ అనే జాయింట్ వెంచర్ ని 04 అక్టోబర్ 2013 నాడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించినట్టు తెలిసింది.
భారత దేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పెంచడమే లక్ష్యంగా, ‘Indian Oil-Adani Gas Private Limited’ అనే జాయింట్ వెంచర్ ని ప్రారంభించినట్టు అదాని గ్యాస్ లిమిటెడ్ తమ వెబ్సైటులో తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ ని IOCL, అదాని గ్యాస్ లిమిటెడ్ 50-50 శాతం భాగస్వామ్యంతో ప్రారంభించారు. 2019-20 బ్యాలెన్స్ షీట్ లో, ఈక్విటీ షేర్ ని 50-50 శాతంగా IOCL, అదాని గ్యాస్ లిమిటెడ్ పంచుకున్నట్టు మాకు ఆధారాలు లభించాయి. ఈ వివరాల ఆధారంగా IOCL సంస్థని అదాని గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ కొనలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 యూనియన్ బడ్జెట్ లో, ఆర్ధిక మంత్రి నిర్మల సితారామన్ IOCL సంస్థని అమ్ముతున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు.
చివరగా, ‘Indian Oil-Adani Gas Private Limited (IOAGPL)’ అనే జాయింట్ వెంచర్ ని IOCL, అదాని గ్యాస్ లిమిటెడ్ తో కలిసి 2013 లో ప్రారంభించింది.