Fake News, Telugu
 

భారత ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతభత్యాల కోసం ప్రతిఏటా 100 బిలియన్ రూపాయలను ఖర్చు చేస్తుందంటూ షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు

0

భారత ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతభత్యాల కోసం ప్రతి సంవత్సరం 100 బిలియన్ రూపాయలను ఖర్చు చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. లోక్‌సభ మరియు రాజ్యసభను కలుపుకొని మొత్తంగా 776 పార్లమెంట్ సభ్యులు ఉన్నారని, ప్రభుత్వం వారిలో ఒక్కొక్కరికి నెలకు 5 లక్షల రూపాయలు జీతంగా ఇస్తుందని, ఈ లెక్కన పార్లమెంట్ సభ్యుల జీతాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 465 కోట్ల 60 లక్షలు ఖర్చు చేస్తుందని ఈ పోస్టులో తెలిపారు. అలాగే, దేశంలో మొత్తంగా 4,582 మంది ఎంఎల్ఏ మరియు ఎంఎల్‌సి‌లు ఉన్నారని, ఒక్కొక్కరికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలను నెల జీతంగా ఇస్తుందని, ఈ లెక్కన సంవత్సరానికి శాసనసభ్యుల జీతాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 1100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని పోస్టులో తెలుపుతున్నారు. కేవలం, ప్రజాప్రతినిధుల జీతాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 15 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, నివాసం, ఆహారం, ప్రయాణ భత్యం మొదలగు సౌకర్యాల కోసం అదనంగా మరో 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, పోలీస్ భద్రత ఖర్చులు కలుపుకొని మొత్తంగా ప్రజా ప్రతినిధుల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 100 బిలియన్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జితభత్యాల కోసం ప్రతి సంవత్సరం 100 బిలియన్ రూపాయలను ఖర్చు చేస్తోంది.

ఫాక్ట్ (నిజం): లోక్‌సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఒక లక్ష రూపాయలను నెల జీతంగా ఇస్తుంది. నియోజకవర్గం మరియు ఆఫీస్ భత్యాలు కలుపుకొని ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు నెలకు 2 లక్షల 30 వేల రూపాయలు ఇస్తుంది. శాసనసభ సభ్యుల వేతనాలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. దేశంలో తెలంగాణ శాసనసభ్యులు నెలకు అత్యధికంగా 2 లక్షల 30 వేల రూపాయలు జీత భత్యాలుగా (అలవెన్సులు కలుపుకొని) పొందుతుంటే, ఢిల్లీ శాసనసభ్యులు నెలకు కేవలం 90 వేల రూపాయలను జీత భత్యాలుగా పొందుతున్నారు. ప్రజాప్రతినిధులు పొందుతున్న జీతాలని ‘ఇతర ఆదాయ వనరుల’ కింద లెక్కిస్తూ పన్ను విధిస్తారని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 బిలియన్ రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్న పోస్టులోని గణాంకాలు పూర్తిగా తప్పు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు:

పోస్టులో చేస్తున్న క్లెయింలకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల వివరాలు తెలుపుతూ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫ్ఫైర్స్ పబ్లిష్ చేసిన “THE SALARY, ALLOWANCES AND PENSION OF MEMBERS OF PARLIAMENT ACT, 1954 AND RULES MADE THEREUNDER” డాక్యుమెంట్ లభించింది. లోక్‌సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన ప్రస్తుత 780 (లోక్‌సభ-541, రాజ్యసభ-239) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలను నెల జీతంగా ఇస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫ్ఫైర్స్ ఈ డాక్యుమెంట్లో స్పష్టంగా తెలిపింది.

ఇవి కాకుండా, నియోజకవర్గం భత్యం కింద ₹70 వేలు, సెక్రెటరీయల్ మరియు ఆఫీస్ భత్యాల కింద ₹60 వేలను పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వం అధనంగా ఇస్తుంది. ఈ లెక్కన ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు నెలకు 2 లక్షల 30 వేల రూపాయలను జీత భత్యాలుగా (అలవెన్సులు కలుపుకొని) ఇస్తున్నట్టు స్పష్టమయ్యింది. అంటే, ప్రభుత్వం సంవత్సరానికి 215.28 కోట్ల రూపాయలను ప్రజాప్రతినిధుల జీతాల కోసం ఖర్చు చేస్తున్నట్టు ఈ వివరాల ఆధారంగా స్పష్టమయ్యింది. పోస్టులో చెప్తున్నట్లు పార్లమెంటు సభ్యులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలను ప్రతినెలా జీతభత్యాలుగా ఇవ్వటం లేదు.

2014-15 నుండి 2017-18 వార్షిక సంవత్సరాలలో లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యుల జీతభత్యాల కోసం మొత్తంగా 1,997 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం 2018లో ఒక ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది. పోస్టులో తెలుపుతున్నట్టు పార్లమెంటు సభ్యుల జీత భత్యాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 30 వేల కోట్లను ఖర్చు పెట్టడం లేదు.

రాష్ట్రాల శాసనసభ్యుల జీతభత్యాలు:

దేశంలోని శాసనసభ్యుల జీతభత్యాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి వారి వారి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని అమలుపరుస్తాయి. శాసనసభ సభ్యుల వేతనాలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం శాసనసభ్యులకు అత్యధికంగా నెలకు 2 లక్షల 30 వేల రూపాయలు (అలవెన్సులు కలుపుకొని) జీతభత్యాలుగా చెల్లిస్తుంటే, ఢిల్లీ శాసనసభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ప్రతినెలా 90,000 రూపాయలు మాత్రమే జీతభత్యాలుగా పొందుతున్నారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. తమిళనాడు శాసనసభ్యులు నెలకు ఒక లక్ష అయిదు వేల రూపాయలను జీతభత్యాలుగా పొందుతున్నారు. కాబట్టి, దేశమంతటా శాసనసభ్యులకు ప్రభుత్వం నెలకు రెండు లక్షలు రూపాయలను జీత భత్యాలుగా పొందుతున్నారని పోస్టులో చేసిన వాదనలో ఎటువంటి అర్ధం లేదు.

పార్లమెంట్ క్యాంటీన్ ధరలు:

పార్లమెంటు క్యాంటీన్‌లోని భోజన ధరలని సవరిస్తూ లోక్‌సభ సెక్రేటరీయేట్ 2021 జనవరి నెలలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్లో తెలిపిన వివరాల ప్రకారం పార్లమెంటు క్యాంటీన్‌లో ప్రస్తుతం ఒక చపాతీ ధర 3 రూపాయలు, చికెన్ కర్రీ ధర 75, చికెన్ బిర్యానీ ధర 100 రూపాయలకు పెరిగిందని స్పష్టంగా తెలుస్తుంది.

ప్రజాప్రతినిధులు పొందుతున్న జీతాలకు పన్ను విధించరా?

ఎంపీ లేదా ఎంఎల్ఏ పొందుతున్న జీతాన్ని ‘ఇతర ఆదాయ వనరుల’ కింద పన్ను విధిస్తారని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి పొందే నియోజకవర్గం భత్యాలు, ఆఫీస్ మరియు ఇతర భత్యాలపై పన్ను మినహాయింపుని ఇచ్చినప్పటికీ, బేసిక్ జీతంగా పొందే డబ్బులపై ఇతర ఆదాయ వనరుల కింద పన్ను విధిస్తారని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రుల భద్రత కోసం 16,000 మంది సిబ్బంది ప్రత్యేకంగా నియమించారని, వారి కోసం ప్రభుత్వం 776 కోట్లు ఖర్చు చేస్తుందని ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

చివరగా, భారత ప్రభుత్వం ప్రజాప్రతినిధుల జీతభత్యాల కోసం ప్రతి సంవత్సరం 100 బిలియన్ల రూపాయలను ఖర్చు చేస్తుందంటూ షేర్ చస్తున్న ఈ గణాంకాలు తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll