Fake News, Telugu
 

ఇటీవల ఎన్టీఆర్ పేరిట ప్రభుత్వం విడుదల చేసింది స్మారక నాణెం, వీటిని ప్రైవేటుగా డబ్బు కట్టి ముద్రించలేము

0

ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ స్మారక నాణెం ప్రభుత్వం విడుదల చేసినవి కావని, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి డబ్బులు చెల్లించి వాటిని ముద్రించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఆయన కుమార్తె పురందేశ్వరి డబ్బులు చెల్లించి ముద్రించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయించింది.

ఫాక్ట్(నిజం): ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా విడుదల చేసింది స్మారక నాణెం. వీటిని ప్రైవేటుగా డబ్బు కట్టి ముద్రించలేము. భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు మాత్రమే వీటిని ముద్రిస్తారు. వీటిపై భారత ప్రభుత్వ రాజముద్ర అయిన మూడు సింహాల గుర్తు ఉంటుంది. ఇకపోతే, సావనీర్ నాణెలు అనే వాటిని ఎవరైనా డబ్బు చెల్లించి ముద్రించుకోవచ్చు. కాకపోతే వీటిపై మూడు సింహాల గుర్తు ఉండదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణేనికి  ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది.

ఐతే వైరల్ అవుతున్న పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ నాణేన్ని ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి డబ్బులు చెల్లించి ముద్రించలేదు. వీటిని ప్రభుత్వమే ముద్రించింది, దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మార్చిలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది.

సావనీర్ & స్మారక నాణెం :

సాధారణంగా రోజువారి చలామణిలో వాడే నాణేలు కాకుండా మరో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సావనీర్ నాణెం, రెండు స్మారక నాణెం. సావనీర్ నాణెంపై మూడు సింహాల గుర్తు ఉండదు, స్మారక నాణెంపై మూడు సింహాల గుర్తు ఉంటుంది, ఇదే ఈ రెండు నాణేల మధ్య ముఖ్యమైన తేడా.

సావనీర్ నాణెం: ఎవరైనా నిర్ణీత ధర చెల్లించి తమ సంస్థ, తమకు నచ్చిన వ్యక్తి బొమ్మ లేదా మరేదైనా ముఖ్యమైన సందర్భం వంటి వాటిపై నాణేలు ముద్రణ చేయించుకోవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వ మింట్లలో ముద్రించిన పలు సావనీర్ నాణేలు ఇక్కడ చూడొచ్చు.

స్మారక నాణెం:  వీటిని సావనీర్ నాణేల్లాగా ప్రైవేటుగా డబ్బు కట్టి ముద్రించలేము, భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు మాత్రమే వీటిని ముద్రిస్తారు. వీటిపై భారత ప్రభుత్వ రాజముద్ర అయిన మూడు సింహాల గుర్తు ఉంటుంది. చట్టప్రకారం అది లీగల్ టెండరే, కానీ ఇవి సాధారణ నాణేల్లాగా చెలామణీలో ఉండవు. వీటిని నాన్ సర్క్యులేటింగ్ లీగల్ టెండర్ అంటారు. కొందరు ప్రముఖ వ్యక్తుల స్మారకార్ధం ముద్రించిన పలు నాణేలు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ప్రస్తుత ఎన్టీఆర్ నాణెం ఈ స్మారక నాణెం కేటిగిరికి చెందుతుంది. ఈ నాణెంపై భారత ప్రభుత్వ రాజముద్ర అయిన మూడు సింహాల గుర్తు ఉంటుంది. ఇదే విషయం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కూడా స్పష్టంగా ఉంది.

దీన్నిబట్టి ఎన్టీఆర్ స్మారక నాణెన్ని పురందేశ్వరి డబ్బులిచ్చి ముద్రించారన్న వార్తలో నిజంలేదని స్పష్టమవుతుంది. కాకపోతే పురందేశ్వరి తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట నాణేలు త్వరగా తయారు చేసేలా ప్రయత్నం చేసినట్టు కొందరు అధికారులు చెప్పినట్టు బీబీసీ రిపోర్ట్ చేసింది.

చివరగా, ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ స్మారక నాణెన్ని పురందేశ్వరి డబ్బులిచ్చి ముద్రించారన్న వార్తలో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll