Fact Check, Fake News, Telugu
 

2020 సంవత్సరానికి గాను GDP వృద్ది రేటులో భారత దేశం 164 స్థానంలో ఉంది, మొత్తం GDP విలువలో కాదు

0

‘ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్ధిక దేశంగా ఉన్న ఇండియా, ఇప్పుడు 167వ స్థానానికి దిగజారిందని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్ధిక దేశంగా ఉన్న ఇండియా, ఇప్పుడు 167వ స్థానానికి దిగజారింది.

ఫాక్ట్ (నిజం): IMF ప్రపంచ దేశాల GDP వృద్దికి సంబంధించి అక్టోబర్ 2020లో విడుదల చేసిన గణాంకాలలో 2020 సంవత్సరానికి గాను భారత దేశ GDP వృద్ది రేటు ‘-10.289’ గా ఉంటుందని అంచనా వేసింది. ఈ గణాంకాల ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ అనే సంస్థ నవంబర్ 2020లో ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది, ఈ ర్యాంకింగ్స్ ప్రకారం 2020వ సంవత్సరానికి గాను GDP వృద్ది రేటు అంశంలో భారత దేశ ర్యాంక్ 164గా ఉంది. ఐతే ఈ ర్యాంకుని మొత్తం GDP విలువ కి సంబంధించిన ర్యాంకుగా తప్పుగా అర్ధం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అక్టోబర్ 2020లో ఇంటర్నేషనల్ మోనేటరీ ఫండ్ (IMF) ప్రపంచ దేశాల GDP వృద్దికి సంబంధించి విడుదల చేసిన గణాంకాలలో 2020 సంవత్సరానికి గాను భారత దేశ GDP వృద్ది రేటు ‘-10.289’ గా ఉంటుందని అంచనా వేసింది. పైగా పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా లెక్కించినప్పుడు 2020వ సంవత్సరంలో భారత దేశ GDP 8,681.303 బిలియన్ డాలర్లు గా ఉంది.

ఐతే ఇంటర్నేషనల్ మోనేటరీ ఫండ్ విడుదల చేసిన ఈ గణాంకాల ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ అనే సంస్థ నవంబర్ 2020లో ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం 2020 సంవత్సరానికి భారత దేశ GDP 2,592.58 బిలియన్ డాలర్ల తో ప్రపంచ దేశాలలో 6వ స్థానంలో ఉండగా, 2019లో 2,868.93 బిలియన్ డాలర్ల తో 5వ స్థానంలో ఉంది. పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా లేక్కించినప్పుడు 2019లో 9,542.26 బిలియన్ డాలర్లు, 2020లో 8,681.30 బిలియన్ డాలర్లతో GDP ర్యాంకింగ్స్ లో భారత దేశం 3వ ర్యాంక్ లో నిలిచింది.

GDP వృద్దిలో భారత దేశ ర్యాంక్ 164గా ఉంది. ఈ ర్యాంక్ ని ఇటీవల ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు తన ట్విట్టర్ ఎకౌంటు లో షేర్ చేసాడు. ఐతే పోస్టులో చెప్తున్నది ఈ ర్యాంకింగ్స్ ఆధారంగానే అన్న విషయం అర్ధమవుతుంది. కాకపోతే 2020 సంవత్సరానికి GDP వృద్ది రేట్ లో 164 స్థానంలో ఉన్న భారత దేశ ర్యాంక్ ని GDP విలువలో 167వ ర్యాంక్ గా తప్పుగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే IMF విడుదల చేసిన డేటాలో 2021వ సంవత్సరానికి భారత దేశ GDP వృద్ది రేటు 8.804గా ఉంటుందని అంచనావేసింది, దిని ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో 2021 సంవత్సరానికి GDP వృద్ది రేటులో భారత దేశం 8వ ర్యాంకులో నిలిచింది.

చివరగా, 2020 సంవత్సరానికి గాను GDP వృద్ది రేటులో భారత దేశం164 స్థానంలో ఉంది, మొత్తం GDP విలువలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll