ఇటీవల వైజాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ దగ్గర కొందరు దుండగులు 13 ఏళ్ల బాలికని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారని, ఆ బాలిక కుటుంబ ఆర్థిక నేపథ్యం కారణంగా ఈ వార్తని ప్రధాన మీడియా చూపించలేదని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: వైజాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ దగ్గర ఇటీవల కొందరు దుండగులు 13 ఏళ్ల బాలికని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు.
ఫాక్ట్: ఈ ఘటన 05 అక్టోబర్ 2021లో వైజాగ్‌లోని అగనంపూడిలో జరిగింది. నరేష్(28) అనే వ్యక్తి ఒక బాలికను (13) లోబరుచుకొని రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నరేష్ ఫ్లాట్లో ఉన్న బాలిక కోసం ఆమె తండ్రి వెతకగా, భయంతో ఆమె అపార్ట్‌మెంట్ పై నుంచి దూకింది. నరేష్ అత్యాచారం చేసినందుకు IPC మరియు POCSO చట్టాల ప్రకారం వివిధ సెక్షన్ల కిందు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఈ విషయంపై మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించి ది హిందూ, సాక్షి తదితర మీడియా సంస్థలు ప్రచురించిన చేసిన వార్తా కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన 05 అక్టోబర్ 2021 అర్థరాత్రి జరిగింది. వైజాగ్‌లోని అగనంపూడిలో ఒక అపార్ట్‌మెంట్లో సత్యం అనే వ్యక్తి వాచ్‌మ్యాన్ గా పనిచేస్తూ అక్కడే కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే 05 అక్టోబర్ 2021 అర్థరాత్రి లేచి చూడగా, ఎనిమిదవ తరగతి చదువుతున్న సత్యం కుమార్తె కనిపించలేదు. బాలిక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు చుట్టుపక్కల గాలించగా, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ ముందు బాలిక చనిపోయి పడి ఉండటం గమనించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, FIR నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
మొదట అనుమానాస్పద మృతిగా భావించి CrPC సెక్షన్ 174 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దర్యాప్తు అనతరం వెల్లడించిన విషయాల ప్రకారం, ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్లో ఉంటున్న నరేష్ (28) అనే వ్యక్తి ఈ బాలికను లోబరుచుకొని రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 05న రాత్రి నరేష్ ఉంటున్న ఫ్లాట్‌కి వెళ్ళింది. అయితే అదే సమయానికి నిద్ర లేచిన బాలిక తండ్రి సత్యం, బాలిక లేక పోవడం చూసి వెతికాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక, భయంతో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నరేష్ పై IPC సెక్షన్ 376 (అత్యాచార నేరం) మరియు పోక్సో చట్టం సెక్షన్ 6, 12, 11(iii), 5(i) కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పు వివరాల కోసం దువ్వాడ పోలీసులను సంప్రదించడం జరిగింది. అదనపు సమాచారం అందిన వెంటనే ఈ కథనం సవరించబడుతుంది.
చివరిగా, విశాఖలో 2021 న జరిగిన ఘటనని ఇటీవల వైజాగ్‌లో కొందరు దుండగులు 13 ఏళ్ల బాలికని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారాని చెప్తూ ప్రచారం చేస్తున్నారు.