Fake News, Telugu
 

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధూలే రూరల్ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు 1,057 ఓట్లు వచ్చాయి

0

23 నవంబర్ 2024న, భారత ఎన్నికల సంఘం (ECI) 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఈ ఎన్నికలలో బీజేపీ 132 సీట్లు, శివసేన (షిండే వర్గం) 57 సీట్లు, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 41 సీట్లు గెలుచుకున్నాయి. మహా వికాస్ అఘాడి (MVA)లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) 10 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) 20 సీట్లు గెలుచుకున్నాయి (ఇక్కడ). మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది.  ఈ నేపథ్యంలోనే, “2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు సున్నా (0) ఓట్లు వచ్చాయని గ్రామస్థులు EVMలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు సున్నా ఓట్లు వచ్చాయి.

ఫాక్ట్(నిజం): 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్ అవధాన్ గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌లలో మొత్తం 1,057 ఓట్లను సాధించారని ధూలే జిల్లా సమాచార కార్యాలయం, ధూలే రూరల్ నియోజకవర్గ ఎన్నికల సంఘం వర్గాలు ధృవీకరించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు 0 ఓట్లు వచ్చాయని గ్రామస్థులు నిరసన తెలిపారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇలా నిరసనలు జరిగినట్లు ఎలాంటి  విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. 

ఈ క్రమంలోనే, మేము ఇదే వీడియోను ఇదే క్లెయిమ్‌తో అనేక మంది సోషల్ మీడియా యూజర్స్ షేర్ చేసినట్లు గుర్తించాము. ఈ వైరల్ పోస్ట్ నిశితంగా పరిశీలించగా, ఓ వైరల్ పోస్టుపై జిల్లా సమాచార కార్యాలయం, ధూలే వారు స్పందిస్తూ చేసిన ఓ పోస్టు లభించింది. ఈ పోస్టులో, ఈ వీడియో ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించింది కాదని, ధూలే రూరల్ నియోజకవర్గంలో అటువంటి సంఘటన జరగలేదని ఖండించారు. “ఈ వీడియో ఎక్కడ నుండి ఉద్భవించిందో అస్పష్టంగా ఉంది. అలాగే, ధూలే గ్రామీణ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహన్ కువార్ ధూలేలో అలాంటి ఆందోళన జరగలేదని ధృవీకరించారు” అని ఈ పోస్టు పేర్కొంది (ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్) (మరాఠీ నుండి తెలుగులోకి అనువదించగా).

ఇదే వైరల్ పోస్టుపై స్పందిస్తూ ధూలే జిల్లా సమాచార కార్యాలయం మరో పోస్టు చేసింది. ఈ పోస్టులో “సహాయ ఎన్నికల అధికారి, ధూలే గ్రామీణ్ అందించిన సమాచారం ప్రకారం, 06-ధూలే రూరల్ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం నాలుగు పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని, ఈ పోలింగ్ స్టేషన్‌లు  సీరియల్ నంబర్స్ 247, 248, 249 మరియు 250గా ఉన్నాయిని, కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్ ఈ పోలింగ్ స్టేషన్‌లలో వరుసగా 227, 234, 252 మరియు 344 ఓట్లను పొందారు” అని పేర్కొంది (ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్). ఇదే పోస్టుపై స్పందిస్తూ ఒకరు, అవధాన్ గ్రామంలో కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్‌కు ఇదే సంఖ్యలో ఓట్లు వచ్చాయని చూపించే పత్రం (బహుశా కౌంటింగ్ ఏజెంట్ కాపీ కావచ్చు) షేర్ చేశారు (ఇక్కడ).

ధూలే రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరికీ వివిధ పోలింగ్ స్టేషన్‌లలో పోలైన ఓట్ల సమాచారాన్ని పంచుకుంటూ చేసిన పలు పోస్టులు చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడఇక్కడ) (ఆర్కైవ్ చేసిన లింక్ ). ఈ సమాచారం ప్రకారం, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో ఉన్న నాలుగు పోలింగ్ స్టేషన్లలో (247, 248, 249, మరియు 250) కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్ 227, 234, 252 మరియు 344 ఓట్లు పొందారు. ఈ సమాచారం ప్రకారం, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్ మొత్తం 1,057 ఓట్లు పొందారని మానం నిర్ధారించవచ్చు.

ఇదే విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి క్వింట్ (Quint) మరియు ఇండియా టుడే (India Today) కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్‌ను సంప్రదించగా, వారితో మాట్లాడుతూ, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో తనకు సున్నా ఓట్లు వచ్చాయన్న వాదన అవాస్తవమని, అవధాన్ గ్రామంలో తనకు 1,057 ఓట్లు వచ్చాయని ధృవీకరించారు.

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కునాల్‌బాబా పాటిల్ బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర (రామదాదా) మనోహర్ పాటిల్ చేతిలో 66,320 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాఘవేంద్ర పాటిల్‌కు మొత్తం 170,398 ఓట్లు రాగా, కునాల్‌బాబా పాటిల్‌కు 104,078 ఓట్లు వచ్చాయి (ఇక్కడ).

ఇటీవల కొన్ని మరాఠీ వార్తా సంస్థలు ఇదే వైరల్ వీడియోను, ధూలే రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అవధాన్ గ్రామస్తులు అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తున్నారని రిపోర్ట్ చేస్తూ కథనాలు పబ్లిష్ చేశాయి. ‘ఆజ్ తక్ (Aaj Tak)’ సంస్థ కథనం, ఈ వీడియో ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిది అని, కునాల్‌బాబా రోహిదాస్ పాటిల్ మద్దతుదారులు ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారని పేర్కొంది. అయితే, ధూలే జిల్లా సమాచార కార్యాలయం, ఈ వీడియో ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిది కాదని మరియు ధూలేలో అలాంటి నిరసన జరగలేదని పేర్కొంది.

చివరగా, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధూలే రూరల్ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు 1,057 ఓట్లు వచ్చాయిని ధులే రూరల్ నియోజకవర్గ ఎన్నికల సంఘం వర్గాలు ధృవీకరించాయి.

Share.

About Author

Comments are closed.

scroll