Fake News, Telugu
 

1994లో బిల్ గేట్స్ మిలియన్ డాలర్లు చెల్లించి కొన్నది లియోనార్డో డా విన్సీ గ్రంథాన్ని, గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్‌ను కాదు

0

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 135 కోట్ల రూపాయలు చెల్లించి బైబిల్ గ్రంథాన్ని కొన్నాడని చెప్తున్న ఒక న్యూస్ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. బైబిల్ విశిష్టతను వివరించే ఈ కథనంలో 1994లో ఈ గ్రంథాన్ని కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. ప్రింటింగ్ మిషన్‌ను కనుగొన్న తరువాత మొదటిసారిగా ముద్రించిన గ్రంథం బైబిల్ అని, ప్రపంచంలోనే కాక మన దేశంలో కూడా బైబిల్‌నే మొదట ముద్రించారని కూడా ఈ క్లిప్‌లో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ఆ వాదనలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1994లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 135 కోట్ల రూపాయలు చెల్లించి బైబిల్ గ్రంథాన్ని కొన్నాడు.

ఫాక్ట్(నిజం): 1994లో బిల్ గేట్స్ 30.8 మిలియన్ డాలర్లు చెల్లించి లియోనార్డో డా విన్సీ యొక్క ‘కోడెక్స్ లీసెస్టర్’ అనే గ్రంథాన్ని కొనుగోలు చేసాడు. గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్‌ను బిల్ గేట్స్ కొన్నట్టు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

1994లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అప్పట్లో అత్యధిక ధర చెల్లించి ఒక పుస్తకాన్ని కొన్న విషయం నిజమే అయినప్పటికీ, బిల్ గేట్స్ కొన్నది బైబిల్ గ్రంథాన్ని కాదు, లియోనార్డో డా విన్సీ యొక్క ‘కోడెక్స్ లీసెస్టర్’ అనే గ్రంథాన్ని (మాన్యుస్క్రిప్ట్). అలాగే ఈ క్లిప్‌లో పేర్కొన్న పలు అంశాలకు సంబంధించి వివరణ కింద చూద్దాం.

బిల్ గేట్స్ కొన్నది లియోనార్డో డా విన్సీ పుస్తకాన్ని:

‘కోడెక్స్ హామర్’ అని కూడా పిలువబడే ఈ పుస్తకం 1506 – 1510 మధ్య కాలంలో వ్రాయబడింది. ఖగోళ శాస్త్రం, మెకానిక్స్, వృక్షశాస్త్రం, గణితం మరియు ఆర్కిటెక్చర్ వంటి విషయాల గురించి తన స్కెచ్‌లు మరియు ఆలోచనలను ఈ గ్రంధంలో లియోనార్డో పొందపరిచారు. ఈ గ్రంధాన్ని బిల్ గేట్స్ 30.8 మిలియన్ డాలర్లు చెల్లించి కొన్నాడు (సుమారు 209 కోట్లు).

గతంలో పలు సందర్భాలలో జోహన్నెస్ గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్ కాపీలు వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయినట్టు వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) రిపోర్ట్ చేసినప్పటికీ, గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్‌ను బిల్ గేట్స్ కొన్నట్టు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగానే బిల్ గేట్స్ ఈ బైబిల్‌ను అత్యధిక ధర చెల్లించి ఖరీదు చేసి ఉంటే ఈ విషయానికి సంబంధించి మీడియా కథనాలు ఉండేవి, కాని మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు.

ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తరవాత గుటెన్‌బర్గ్ మొదట ప్రింట్ చేసింది బైబిల్‌నే:

ఐతే వైరల్ న్యూస్ పేపర్ క్లిప్‌లో చెప్తున్నట్టు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తరవాత జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మొదట ప్రింట్ చేసింది బైబిల్ అని ఆధారాలు తెలుపుతున్నాయి. గూటెన్‌బర్గ్ దాదాపు 180 బైబిల్ కాపీలను ముద్రించగా వీటిలో 145 కాగితంపై ముద్రించినవి కాగా మిగిలిన ముప్పై ఐదు వెల్లమ్ (ప్రాసెస్ చేసిన దూడ చర్మం)పై ముద్రించినవి.

ఐతే కాగితంపై ముద్రించిన కాపీలలో కేవలం 49 బైబిళ్లు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉండగా, ముప్పై ఐదు వెల్లమ్ కాపీలలో ఇప్పుడు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిలో ఒక కాపీని  అమెరికా కాంగ్రెస్ లైబ్రరీ  1930లో సొంతం చేసుకోగా, మిగిలిన రెండింటిలో ఒకటి పారిస్‌లోని నేషనల్ లైబ్రరీలో ఉండగా మరొకటి లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.

ఇదిలా ఉండగా మే 2023లో ‘కోడెక్స్ సాసూన్’ అనే పురాతన హీబ్రూ బైబిల్ ఒకటి 38.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజియం దీనిని వేలంలో సొంతం చేసుకుంది.

భారత్‌లోకి పోర్చుగీస్ మిషనరీల ద్వారా ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశించింది:

16వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీస్ మిషనరీల ద్వారా ప్రింటింగ్ ప్రెస్ గోవాకు ప్రవేశించినట్టు తెలుస్తుంది. క్రైస్తవ ప్రీస్ట్‌లు కొంకణి నేర్చుకుని బైబిల్‌లోని శ్లోకాలను అనేక కరపత్రాలుగా ముద్రించినట్టు తెలుస్తుంది. ఆ తరవాత కాలక్రమేణా, భారతదేశంలోని స్థానిక భాషలలో అనేక పుస్తకాలు ముద్రించబడ్డాయి (ఇక్కడ).

చివరగా, 1994లో బిల్ గేట్స్ మిలియన్ డాలర్లు చెల్లించి కొన్నది లియోనార్డో డా విన్సీ గ్రంథాన్ని, గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్‌ను కాదు.

Share.

About Author

Comments are closed.

scroll