1991లో IMF దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పును 2009లో మన్మోహన్ సింగ్ తీర్చడమే కాకుండా అదే IMF దగ్గర 200 టన్నుల బంగారాన్ని కొన్నాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1991లో IMF దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పును 2009లో మన్మోహన్ సింగ్ తీర్చడమే కాకుండా అదే IMF దగ్గర 200 టన్నుల బంగారాన్ని కొన్నాడు
ఫాక్ట్(నిజం): డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1981- 1984, 1991- 1993 మధ్య కాలంలో భారత దేశం IMF దగ్గర తీసుకున్న రుణాన్ని 31 మే 2000వ తేది కల్లా తిర్చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
1991 IMF రుణం:
మినిస్ట్రీ అఫ్ ఫైనాన్స్ లోని డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారి సమాచారం ప్రకారం 1981- 1984 మధ్య కాలంలో భారత దేశం IMF SDR 3.9 బిలియన్ రుణాన్ని పొందింది. ఇంకా 1991- 1993 మధ్య కాలంలో SDR 3.56 బిలియన్ రుణాన్ని కూడా పొందింది. ఇదే సమాచారం IMF వెబ్సైటులో కూడా చూడవచ్చు. ఐతే డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రకారం 31 మే 2000వ తేది కల్లా ఈ రుణాన్ని మొత్తం భారత దేశం తిర్చేసింది. అంతేగాక, దీని తరవాత నుండి భారత దేశం IMFలో కంట్రిబ్యూటర్ గా మారింది. IMF దగ్గర భారత ప్రభుత్వం ఇప్పటి వరకు పొందిన రుణాల గురించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. 1991వ సంవత్సరంలో భారత దేశం IMF దగ్గర పొందిన రుణాల సమాచారం 1991 IMF వార్షిక నివేదికలో చదవొచ్చు. దీన్నిబట్టి 1991 తీసుకున్న రుణాన్ని 2009లో మన్మోహన్ సింగ్ తీర్చలేదని చెప్పొచ్చు.
1991లో బంగారం తాకట్టు:
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1990లో గల్ఫ్ వార్ కారణంగా తగ్గిన విదేశీ మారకం, పెరిగిన చమురు ధరలు మొదలైన కారణాల వల్ల భారత ఆర్ధిక పరిస్థితి దిగాజారిపాయింది. ఇదే పరిస్థితి 1991లో కూడా కొనసాగి, దీనికి తోడు, తగ్గిన విదేశి నిల్వలు, బ్యాలన్స్ అఫ్ పేమెంట్ క్రైసిస్ కారణంగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బంగారాన్ని బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి రుణాలు చేచ్చింది. భారత ప్రభుత్వం, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మధ్యలో జరిగిన లావాదేవిల వల్ల సమకూరిన 65.27 టన్నుల బంగారాన్ని రాబడి కోసం RBI విదేశాలలో డిపాజిట్ చేసింది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు. దీన్నిబట్టి 1991లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బంగారాన్ని బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్, బ్యాంకు అఫ్ జపాన్ లో తాకట్టు పెట్టింది గాని IMF దగ్గర కాదని చెప్పొచ్చు.
2009లో RBI బంగారం కొనుగోలు:
2009లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా IMF దగ్గర 200 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇదే విషయం సంబంధించి IMF మరియు RBI విడుదల చేసిన ప్రెస్ నోట్స్ ద్వారా ద్రువీకరించొచ్చు. ఐతే ఈ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు.
చివరగా, 1991లో IMF వద్ద తీసుకున్న రుణాన్ని మే 2000 కల్లా భారత్ తీర్చేసింది.