Fake News, Telugu
 

జీడీపీలో అప్పుల వాటాను పరిగణలోకి తీసుకుంటే భారత్ శ్రీలంకా కన్నా మెరుగైన పరిస్థితిలో ఉంది

0

ఇటీవల శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శ్రీలంక దేశ జీడీపీలో అప్పుల వాటాని, భారతదేశ జీడీపీలో అప్పుల వాటాతో పోల్చుతూ భారతదేశ పరిస్థితి కూడా శ్రీలంకలాగే అవబోతుందని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశ జీడీపీలో అప్పుల వాటా శ్రీలంకలో లాగా ఎక్కువగా ఉంది.

ఫాక్ట్: శ్రీలంక దేశ జీడీపీ కన్నా ఆ దేశ అప్పులే ఎక్కువ ఉన్నాయన్న విషయం నిజమైనప్పటికీ, పోస్టులో చెప్తున్నట్టు  భారతదేశ జీడీపీలో అప్పుల వాటా మరీ అంత ఎక్కువగా లేదు. 2016-17 నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు దేశ జీడీపీలో మొత్తం అప్పులు (స్థానిక + విదేశీ) ఇంచుమించు 50%గా ఉంటూ వస్తుంది. శ్రీలంకతో పోల్చుకుంటే భారత్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. పైగా శ్రీలంకాలో లాగా కాకుండా జీడీపీలో విదేశీ రుణాల వాటా మన దగ్గర చాలా తక్కువగా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

శ్రీలంక దేశ అప్పులు:

ఇటీవల శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే, ఐతే నిపుణుల ప్రకారం పెరిగిపోయిన దేశ అప్పులు (ముఖ్యంగా విదేశీ రుణాలు) ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణమని అభిప్రాయ పడుతున్నారు. IMF ఇటీవల శ్రీలంక ఆర్ధిక పరిస్థితిని సమీక్షించి, దేశ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు అప్పులు తీర్చేందుకు సరిపోవని తెలిపింది.

సాధరణంగా ఒక ఏడాది కాలంలో దేశంలో జరిగే ఉత్పత్తి విలువను జీడీపీ అంటారు. కాబట్టి, జీడీపీలో అప్పుల వాటాని లెక్కించడం ద్వారా ఆ దేశం యొక్క ఆర్ధిక పరిస్థితిని (అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని) అంచనా వేయవచ్చు.  ఐతే శ్రీలంక అప్పులకు సంబంధించి IMF సమాచారం ప్రకారం 2016లో మొత్తం దేశ జీడీపీలో 79.02% ఉన్న అప్పులు 2022 నాటికి 111.42% చేరుకున్నాయి. అంటే శ్రీలంక ఉత్పత్తి చేసే విలువ (జీడీపీ) కన్నా ఆ దేశ అప్పులే ఎక్కువన్నమాట.

శ్రీలంకలో మరో ప్రధాన సమస్య ఏమిటంటే ఆ దేశ అంతర్గత (ఇంటర్నల్) రుణాలు మరియు విదేశీ రుణాలు రెండు ఒకే విధంగా ఉండడం. సాధారణంగా విదేశీ రుణాలు అనేవి ఇతర కరెన్సీలలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుంటాయి. అంటే ఆ దేశం రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదని అర్ధం. అలాంటి సందర్భాలలో అంతర్జాతీయంగా దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది, ఆపై విదేశీ పెట్టుబడులు రావడానికి కష్టమవుతుంది.  

భారతదేశ అప్పుల వివరాలు:

RBI ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2016-17 నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు దేశ జీడీపీలో మొత్తం అప్పుల (స్థానిక + విదేశీ)  శాతం సుమారు 50%గా ఉంటూ వస్తుంది. 2016-17లో 49.54%గా ఉన్న జీడీపీలో అప్పుల విలువ, స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ 2020-21 నాటికి 50.8%కి చేరుకుంది. దీన్నిబట్టి, జీడీపీలో అప్పుల వాటా అంశంలో  శ్రీలంకతో పోల్చుకుంటే భారత్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు.

అదే విధంగా భారతదేశ జీడీపీలో అప్పులలో విదేశీ అప్పుల వాటా చాలా తక్కువ. 2016-17 నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు దేశ జీడీపీలో విదేశీ అప్పుల వాటా 3% కన్నా తక్కువగానే ఉంటూ వస్తుంది. శ్రీలంకతో పోల్చుకుంటే ఈ విషయంలో భారత్ చాలా మెరుగ్గా ఉంది.

ఐతే అన్ని రాష్ట్రాల అప్పులు కూడా కలిపితే దేశ జీడీపీలో అప్పుల వాటా పోస్టులో భారతదేశ జీడీపీలో అప్పుల వాటా అంటూ చెప్తున్న గణాంకాలకి అనుగుణంగా (ఒక 2020-21 సంవత్సరాన్ని మినహాయిస్తే) ఉన్నాయి. జీడీపీలో అప్పుల వాటా (కేంద్ర మరియు అన్ని రాష్ట్రలది కలిపి) 2016-17లో 68.77% కాగా, ఆ తర్వాతి సంవత్సరాలలో ఇది స్వల్పంగా పెరిగి 2020-21లో 73.95%కు చేరుకుంది. ఈ వివరాలు పైని టేబుల్‌లో చూడొచ్చు.  దీన్నిబట్టి, పోస్టులో భారత్‌కు ఆపాదిస్తున్న గణాంకాలు ఇక్కడి నుండే సేకరించి ఉంటారని అర్ధం చేసుకోవచ్చు. కానీ, పైన తెలిపినట్టు కేవలం జీడీపీలో కేంద్ర అప్పుల వాటాని పరిగణలోకి తీసుకుంటే భారతదేశ పరిస్థితి శ్రీలంక కన్న చాలా మెరుగ్గా ఉంది.

చివరగా, జీడీపీలో అప్పుల వాటాను పరిగణలోకి తీసుకుంటే భారత్ శ్రీలంక కన్నా మెరుగైన పరిస్థితిలో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll