Fake News, Telugu
 

కర్ణాటకలోని ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నందిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరు హిందువు, ఇంకొకరు ముస్లిం

0

కర్ణాటకలో ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నందిని హత్య చేసింది ఇద్దరు ఇస్లామిక్ టెర్రరిస్ట్‌లని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నందిని హత్య చేసింది ఇద్దరు ఇస్లామిక్ టెర్రరిస్ట్‌లు.

ఫాక్ట్(నిజం): కర్ణాటకలోని ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నందిని హత్యకు సంబంధించి హసన్ దలాయత్ మరియు నారాయణ్ బసప్ప మది అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇందులో ప్రధాన నిందితుడు నారాయణ్ బసప్ప మది A1గా గుర్తించగా, హసన్ దలాయత్‌ను A2గా గుర్తించారు. ఇందులో ఒకరు హిందూ కాగా, ఇంకొకరు ముస్లిం. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని చికోడి తాలూకాలోని ఒక గ్రామంలో ఉన్న ఆశ్రమం నుండి అదృశ్యం అయిన ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నంది హత్యకు గురయ్యాడు. బెలగావి జిల్లాలో ఓ బోరుబావి నుంచి జైన సన్యాసి శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి హసన్ దలాయత్ మరియు నారాయణ్ బసప్ప మది అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

విచారణలో ఇద్దరు నిందితులు ఈ హత్య తామే చేసినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఆశ్రమంలో అతని భక్తుడొకరితో డబ్బు వివాదం వల్ల జూలై 6న జైన సన్యాసి హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం కోసం చికోడి పోలీసులను మేము సంప్రదించగా, ఈ హత్యలో ప్రధాన నిందితుడు A1 హిందువని, A2 ఒక ముస్లిం అని తెలిపారు. ఈ హత్యలో మతపరమైన కోణం/మత విద్వేషం ఏమీ లేదని, కేవలం ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్టు వారు తెలిపారు.

ఈ వార్తాను ప్రచారం చేసిన కథనాలు కూడా నిందితులిద్దరి ఫోటోలను ప్రసారం చేసారు (ఇక్కడ). పైన చెప్పినట్టు ఇద్దరిలో ఒకరు హిందువు కాగా మరొకరు ముస్లిం. ఐతే వైరల్ పోస్టులో కేవలం ముస్లిం నిందితుడి ఫోటోను మాత్రమే షేర్ చేస్తున్నారు.

చివరగా, కర్ణాటకలోని ప్రసిద్ద జైన సన్యాసి ఆచార్య కామకుమార్ నందిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరు హిందువు, ఇంకొకరు ముస్లిం.

Share.

About Author

Comments are closed.

scroll