అమెరికాలో ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇస్లామిక్ మత గ్రంథమైన ఖురాన్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయ గ్రంథంగా ర్యాంక్ చేసిందని పేర్కొంటున్న ఒక గ్రాఫిక్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయ గ్రంథంగా ఖురాన్‌ను ర్యాంక్ చేసింది
ఫ్యాక్ట్(నిజం): హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయ గ్రంథంగా ఖురాన్‌ను పేర్కొంటూ ఏ ప్రకటన చేయలేదు. హార్వర్డ్ లా స్కూల్లోని వాసర్స్టెయిన్ హాల్ లోపల ఉన్న ఒక ‘వర్డ్స్ ఆఫ్ జస్టిస్’ అనే గ్యాలరీలో ఖురాన్ (సూరా అన్-నిసా 4:135) నుండి ఒక వాక్యం చేర్చబడింది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ముందుగా, వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తనిఖీ చేయడానికి, మేము ఇంటర్నెట్లో ఒక కీవర్డ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖురాన్‌ను ప్రపంచంలోనే న్యాయం కోసం ఉత్తమ పుస్తకంగా ప్రకటించినట్లు మాకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క అధికారిక ప్రకటన కానీ, మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు కానీ లభించలేదు.
అయితే, హార్వర్డ్ లా స్కూల్లో ఉన్న ‘వర్డ్స్ ఆఫ్ జస్టిస్’ అనే గ్యాలరీలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని చేర్చినట్లు, ఈ సెర్చ్ ద్వారా మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఇది ఖురాన్ యొక్క సూరా అన్-నిసా 4:135 వచనం.

1 జూలై 2012న ప్రచురించబడిన హార్వర్డ్ లా బులెటిన్ ప్రకారం, ‘వర్డ్స్ ఆఫ్ జస్టిస్’ అనేది చట్టం, న్యాయం గురించి 33 కోటేషన్లు కలిగి ఉన్న గ్యాలరీ. ‘ఈ కోటేషన్లు 600 BCE మరియు నేటికి మధ్య కాలంలోవి’ అని ఈ బులెటిన్ పేర్కొంది. హార్వర్డ్ లా స్కూల్లో ఉన్న వాసర్స్టెయిన్ హాల్ లోపల ఉన్న మిల్స్టీన్ ఈస్ట్ యొక్క గోడలపై ఈ 33 కొటేషన్లకు చెందిన వాక్యాలను చేతితో స్టెన్సిల్ చేశారు.

గోడపై వ్రాయబడిన ఖురాన్ వాక్యంలో కొంత బాగాన్ని జూలై 2023లో హార్వర్డ్ లా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఉన్న వీడియోలో మనం చూడవచ్చు.

చివరగా, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ‘ఖురాన్’ను ప్రపంచంలోనే న్యాయం కోసం ఉత్తమ పుస్తకంగా ప్రకటించిందనే వైరల్ వాదనకు ఎటువంటి ఆధారాలు లేవు.