‘ఏ కులాన్ని అవమానించినా కేసులు పెట్టేవిధంగా అట్రాసిటీ చట్టసవరణ చేయాలని, ప్రతివాడికి వాడి ఆత్మగౌరవం ముఖ్యమని, ఆత్మగౌరవం ఒక్కరిసొత్తు కాదని సుప్రీం కోర్టు లో వాదిస్తున్న కేంద్ర ప్రభుత్వం..!’, అని చెప్తూ, ఒక న్యూస్ ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఏ కులాన్ని అవమానించినా కేసులు పెట్టేవిధంగా అట్రాసిటీ చట్టసవరణ చేయాలని, ఆత్మగౌరవం ఒకరి సొత్తు కాదని సుప్రీం కోర్టు లో వాదిస్తున్న కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఫోటో.
ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ఆర్టికల్ చాలా పాతది. ఆ ఆర్టికల్ ని ‘ఆంధ్రజ్యోతి’ వారు 2017 లో ప్రచురించారు. జాతి వివక్ష జరగకుండా ఉండటానికి ఐపీసీ లో 153(సి) మరియు 509(ఎ) సెక్షన్లను చేరుస్తామని 2015 లో ఢిల్లీ హైకోర్టుకి ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇప్పటి వరకు 153(సి) మరియు 509(ఎ) సెక్షన్లను ప్రభుత్వం ఐపీసీ లో చేర్చలేదు. ఈ విషయం పై తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో వాదించినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్ట్ లో నాలుగేళ్ల కిందటి ఆర్టికల్ ఫోటో షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న న్యూస్ ఆర్టికల్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ ఆర్టికల్ (ఆర్కైవ్డ్) ని ‘ఆంధ్రజ్యోతి’ వారు ఫిబ్రవరి 2017 లో ప్రచురించినట్టు తెలిసింది. కాబట్టి, పోస్ట్ లో ఉన్నది చాలా పాత ఆర్టికల్. ‘2014 జనవరిలో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకుణ్ణి స్థానికులు నేరస్థుడిగా భావించి కొట్టిచంపారు. ఢిల్లీలో, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద అలజడే చెలరేగింది. వారిని శాంతింప జేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎం.కె.బెజ్‌బారువా కమిటీని వేసింది. కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగానే కులం, జాతి పరంగా కించపరచడాన్ని మూడేళ్ల జైలుశిక్ష వేయదగ్గ తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఐపీసీలో మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రతిపాదనల ప్రకారం ఐపీసీలో 153(సి), 509(ఎ) అని రెండు సెక్షన్లు చేరుస్తున్నారు’, అని ఆర్టికల్ లో చదవొచ్చు. బెజ్‌బారువా కమిటీ రిపోర్ట్ ని ఇక్కడ చూడవొచ్చు.
జాతి వివక్ష జరగకుండా ఉండటానికి ఐపీసీ లో 153(సి) మరియు 509(ఎ) సెక్షన్లను చేరుస్తామని 2015 లో ఢిల్లీ హైకోర్టుకి ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇప్పటి వరకు 153(సి) మరియు 509(ఎ) సెక్షన్లను ప్రభుత్వం ఐపీసీ లో చేర్చలేదని ‘ఇండియా కోడ్’ వెబ్సైటులో చూడవొచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లో ఆ సెక్షన్లు కనపడవు.
లా కమిషన్ వారు మార్చి 2017 లో ‘హేట్ స్పీచ్’ పై రిలీజ్ చేసిన రిపోర్ట్ లో కూడా 153(సి) మరియు 505(ఎ) [509(ఎ) కాదు] సెక్షన్లను ఐపీసీ లో చేర్చమని సూచించినట్టు తెలిసింది.
అయితే, లా కమిషన్, బెజ్‌బారువా కమిటీ, మరియు విశ్వనాథన్ కమిటీ ముగ్గురు కూడా ద్వేషపూరిత వ్యాఖ్యలను నిరోధించడానికి ఐపీసీ లో 153(సి) ని చేర్చమని ఒకే విధంగా కోరాయని, ముగ్గురి సూచనలు పరిశీలించి సమగ్రమైన సూచనలు ఇవ్వమని జనవరి 2018 లో లా కమిషన్ ని ప్రభుత్వం కోరినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మార్చి 2018 లో ఒక ప్రశ్నకు రాజ్యసభ లో సమాధానమిస్తూ తెలిపారు.
పైన చెప్పినట్టు ఇప్పటివరకు 153(సి) లేదా 505(ఎ) లేదా 509(ఎ) సెక్షన్లను ఐపీసీ లో ప్రభుత్వం చేర్చలేదు. ప్రభుత్వం చేర్చకపోవడానికి గల కారణాలను కొన్ని వార్తాసంస్థలు చెప్తూ 2016 మరియు 2017 లో ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. లా కమిషన్ వారు ‘హేట్ స్పీచ్’ పై ఇచ్చిన సూచనలను ప్రభుత్వం అమలు చేసేలా చూడమని సుప్రీం కోర్టులో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 2020 లో పిటిషన్ వేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఆ పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నందున కొట్టివేయబడినది.
153(సి) మరియు 505(ఎ) సెక్షన్లను ఐపీసీ లో చేరుస్తూ 2020 లో ఆప్పటి కాంగ్రెస్ ఎంపీ హుసైన్ దళవాయి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ, అది రద్దు అయింది.
చివరగా, ఫోటోలోని ఆర్టికల్ చాలా పాతది. ఐపీసీ ని ప్రభుత్వం ఇంకా సవరించలేదు. ఈ విషయం పై తాజాగా ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు.