Fake News, Telugu
 

సంగారెడ్డి జిల్లాలో 70% వడ్ల కొనుగోలు పూర్తయిందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలని వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

‘వానాకాలానికి సంబంధించి ఇప్పటివరకి 70% వడ్లను కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మీడియాతో అన్నాడని, కాని సివిల్ సప్లయ్స్ అధికారులు మాత్రం ఇప్పటివరకు 24% మాత్రమే కొన్నామని’ చెప్తున్నారని రిపోర్ట్ చేసిన వెలుగు న్యూస్ పేపర్ క్లిప్‌ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: వానాకాలానికి సంబంధించి ఇప్పటివరకి 70% వడ్లను కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మీడియాతో అన్నాడని చెప్తున్న న్యూస్ క్లిప్.

ఫాక్ట్ (నిజం): హరీష్ రావు నారాయణఖేడ్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకి 70% వడ్ల కొనుగోలు పూర్తయిందని అన్నారు. ఐతే ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని వెలుగు దిన పత్రికలో హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా 70% వడ్ల కొనుగోలు పూర్తయిందని అన్నట్టు అర్ధం వచ్చేలా ఒక కథనాన్ని రిపోర్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 30 నవంబర్ 2021న తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ జిల్లాలో పర్యటించారు, ఈ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లాలో పండే వడ్లు లక్షా నలబై వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్టు, అంటే ఇప్పటికే జిల్లలో 70% కొనుగోలు పూర్తయిందని అన్నారు.

ఐతే హరీష్ రావు మాట్లాడిన ఈ మాటలను తప్పుగా అర్ధం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వానా కాలంలో 70% కొనుగోలు పూర్తయిందని హరీష్ రావు అన్నట్టు, కానీ ఇప్పటివరకు 24% వడ్లనే కొన్నట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు ప్రకటించారని, వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్ రెండు లెక్కలు చెబుతోందని వెలుగు దిన పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం క్లిప్‌ని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది.

హరీష్ రావు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఇతర వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈనాడు రిపోర్ట్ ప్రకారం కూడా హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో 70% కొనుగోలు పూర్తయిందని అన్నారని స్పష్టంగా అర్ధమవుతుంది.

హరీష్ రావు కూడా తన అధికారిక ట్విట్టర్ ఎకౌంటు ద్వారా వెలుగు కథనంపై స్పందిస్తూ తన వ్యాఖ్యలని వక్రీకరించిందని అన్నారు.

చివరగా, సంగారెడ్డి జిల్లాలో 70% వడ్ల కొనుగోలు పూర్తయిందని హరీష్ రావు అన్న వ్యాఖ్యలని వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll