Fake News, Telugu
 

ఆఫ్ఘనిస్తాన్ మ్యూజియంలోని గ్రీక్ దేవత సిబెలీ ఫలకాన్ని షేర్ చేస్తూ పాకిస్తాన్ లోని సూర్య దేవాలయానికి ముడిపెడ్తున్నారు

0

ఒక ఫోటోని చూపిస్తూ ఇది పాకిస్తాన్ లోని సూర్య దేవాలయం అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ లోని సూర్య దేవాలయం యొక్క ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో గ్రీక్ దేవత అయిన సిబెలీ ను వర్ణి౦చే ఉత్సవ ఫలక౦, 200 బి.సి. ఆఫ్ఘనిస్తాన్, ఐ ఖానుమ్ ప్రాంతానికి సంబంధించింది. ప్రస్తుతం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇది ఉన్నట్టు ది మెట్ మ్యూజియం వారి వెబ్ సైట్ ద్వారా తెలుస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ లోని ఫోటో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ది మెట్ మ్యూజియం వారి వెబ్ సైట్ లో అదే ఫోటో మరియు దాని గురించి సమాచారం లభించింది. గ్రీక్ దేవత అయిన సిబెలీ ను వర్ణి౦చే ఉత్సవ ఫలక౦, 200 బి.సి. ఆఫ్ఘనిస్తాన్, ఐ ఖానుమ్ ప్రాంతానికి సంబంధించింది అని, ప్రస్తుతం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇది ఉన్నట్టు ఆ ఫోటో యొక్క కాప్షన్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫలకం గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

పాకిస్తాన్ లోని సూర్య దేవాలయం గురించి గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు, అక్కడ 5,000 సంవత్సరాల పాత సూర్య దేవాలయం ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. క్రీ.పూ 515 లో గ్రీక్ అడ్మిరల్ స్కైలాక్స్ ఉత్తర భారతదేశంపై గ్రీకు దండయాత్ర సమయంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడింది అని, తరువాత ప్రముఖ యాత్రికుడు మరియు చరిత్రకారుడు హ్సుయెన్ త్సాంగ్ కూడా 7వ శతాబ్దంలో ముల్తాన్ ను సందర్శించి ఆలయం గురించి, ముఖ్యంగా ఆలయ బంగారు విగ్రహం మరియు నృత్య బాలికల గురించి ప్రముఖంగా వ్రాశాడు అని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

మరొక వెబ్ సైట్ లోని ఆర్టికల్ లో ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. చివరకు, ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో ఘజ్నీకి చెందిన మహమూద్ ధ్వంసం చేసాడని, ఆ తరువాత ఎన్నడూ దాని పునర్నిర్మాణం కాలేదు అని, ఈ ప్రదేశంలో మొదటి సూర్య దేవాలయం కృష్ణ కుమారుడు సాంబ నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ, ముల్తాన్ లో సూర్య ఆలయం నిర్మించిన తేదీ గురించి ఎవరికీ ఖచ్చితంగా తెలియదు అని ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరు ఆ దేవాలయం గురించి పట్టించుకోవట్లేదు అని, దేవాలయం యొక్క అవశేషాలు (remains) ఏమి లేవని ఆర్టికల్ లో తెలుస్తుంది.

చివరగా, ఆఫ్ఘనిస్తాన్ మ్యూజియంలోని గ్రీక్ దేవత అయిన సిబెలీ యొక్క ఫలకాన్ని షేర్ చేస్తూ పాకిస్తాన్ లోని సూర్య దేవాలయానికి ముడిపెడ్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll