‘బీజేపీ నిలదొక్కుకుంటే ఏదో ఒకరోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం ఎగరేస్తుంది, కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం జెండా పైన చంద్రుడు ఉంటాడు’ ; ‘కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విషజంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద మర్రి చెట్టును మోదీ పెకలించి వేస్తున్నాడు’ ఈ వ్యాఖ్యలు ప్రముఖ విలేఖరి, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టలీ చేసినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీ నిలదొక్కుకుంటే ఏదో ఒకరోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం ఎగరేస్తుంది, కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం జెండా పైన చంద్రుడు ఉంటాడు’ – ప్రముఖ బీబీసీ మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టలీ.
ఫాక్ట్(నిజం): త్రివర్ణ పతాకం నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి వైరల్ అయిన వ్యాఖ్యలు మార్క్ టలీ చేయలేదు. ఇక పొతే తను రాసిన ‘నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను తమకు నచ్చినట్టుగా (మోదీ కాంగ్రెస్ పార్టీని పెకలించి వేస్తాడు) వక్రీకరించారు. మార్క్ టలీ ఈ వ్యాఖ్యలు కూడా తను చేయలేదని స్పష్టతనిచ్చాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బీజేపీ నిలదొక్కుకుంటే ఏదో ఒకరోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం ఎగరేస్తుంది, కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం జెండా పైన చంద్రుడు ఉంటాడు:
ఒక వేళ మార్క్ టలీ నిజంగా ఈ వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసి ఉండేవి, కాని గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మార్క్ టలీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎటువంటి వార్తా కథనాలు/ఆధారాలు లభించలేదు.
మార్క్ టలీ ఇవే వ్యాఖ్యలు చేసినట్టు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఈ వ్యాఖ్యలపై న్యూస్ చెకర్ అనే ఫాక్ట్- చెకింగ్ సంస్థ వివరణ కోరుతూ మార్క్ టలీని సంప్రదించగా ‘ఈ వ్యాఖ్యలకి తనకి ఎటువంటి సంబంధంలేదని, ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని, ఇలాగే తన పేరు మీద ఇంకా చాలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని’ టలీ అన్నాడు.
కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విషజంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద మర్రి చెట్టును మోదీ పెకలించి వేస్తున్నాడు :
ఇకపోతే మార్క్ టలీ తను రాసిన ‘నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో ‘కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విషజంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద మర్రి చెట్టును మోదీ పెకలించి వేస్తున్నాడు’ అన్న వ్యాఖ్యలు చేసాడని చాలా సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే టలీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారంగాని మాకు లభించలేదు.
కాకపోతే మార్క్ టలీ ఈ పుస్తకంలో మోదీ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు చేయనప్పటికీ, దేశంలోని వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి ‘నెహ్రూ వంశం భారతదేశ ప్రజలను, వ్యవస్థలను తన నీడలో కప్పి ఉంచే మర్రి చెట్టులా నిలిచిందని’ అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించాడు. ఈ వారసత్వ వ్యవస్థ ఒక రోజు అంతమై, వలసవాద విదానాలు లేని ఒక కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
దీన్నిబట్టి తన పుస్తకంలో టలీ చేసిన ఈ వ్యాఖ్యలను ‘మోదీ కాంగ్రెస్ అనే మర్రి చెట్టుని పెకలించి వేస్తున్నాడు’ అని కొందరు తమకు నచ్చినట్టు వక్రీకరించి షేర్ చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
వైరల్ అయిన వ్యాఖ్యల గురించి వివరణ కోరుతూ ఆల్ట్ న్యూస్ అనే ఫాక్ట్- చెకింగ్ సంస్థ మార్క్ టలీని మెయిల్ ద్వారా సంప్రదించగా, ‘ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని, ఇది ఒక ఫేక్ వార్త, చాలా రోజుల నుండి సర్క్యులేట్ అవుతుందని’ అయన స్పష్టం చేసారు.
ఐతే గతంలో కూడా ఇలానే ‘సోనియా గాంధీ దేశంపై ఒక మచ్చ’ అని మార్క్ టలీ వ్యాఖ్యానించాడని వార్తలు వచ్చినప్పుడు, ఆ వార్తలలో నిజంలేదని టలీ స్పష్టం చేసాడు. కాకపోతే 2011లో ఒక బుక్ ఆవిష్కరణ సందర్భంలో సోనియా గాంధీపై విమర్శలు చేసినటు ఈ కథనం ద్వారా తెలుస్తుంది.
చివరగా, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టలీ కాంగ్రెస్, బీజేపీ మరియు మోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు