Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా రాజీనామా చేయించిన ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు

0

బంగ్లాదేశ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న క్రమంలో అక్కడి హిందువులపై దాడులు జరిగినట్టు పలు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి జమాత్- ఇ- ఇస్లామీ & BNPకు సంబంధించిన వారు హిందూ ప్రభుత్వ అధికారులను రాజీనామా లేఖలు రాయమని బలవంతం చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఒక మహిళ చుట్టూ అనేక మంది చేరి ఆమెతో బలవంతంగా సంతకం చేయిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో తెలుసుకకుంద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో హిందూ ప్రభుత్వ అధికారులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో రాజీనామా చేస్తూ కనిపించిన మహిళ ‘కబీ నజ్రుల్ గవర్నమెంట్ కాలేజ్’ ప్రిన్సిపాల్ అమీనా బేగం. అవామీ లీగ్‌కు చెందిన ఈమెను నిరసన చేస్తున్న విద్యార్థులు ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి రాజీనామా చేయిస్తున్నారనడానికి ఆధారాలు లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).

ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఇటీవల బంగ్లాదేశ్‌లో ఘటనే అయినప్పటికీ, కథనాల ప్రకారం రాజీనామా చేసిన మహిళ హిందూ కాదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు బంగ్లాదేశీ వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులు ‘కబీ నజ్రుల్ గవర్నమెంట్ కాలేజ్’ ప్రిన్సిపాల్ అమీనా బేగం రాజీనామా చేయాలని ఒత్తిడి చేసారు. ఆమె ఛాంబర్‌లోకి వెళ్ళి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేసారు. అవామీ లీగ్‌లో నాయకత్వ స్థాయిలో ఉన్న అమీనా బేగంపై పలు అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని నిరసన చేస్తున్న విద్యార్థులు తెలిపినట్టు ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలు కూడా కాలేజీ ప్రిన్సిపాల్‌ను అమీనా బేగంగా గుర్తించాయి. అలాగే ఆ కాలేజ్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ పేజీలోని ఒక పోస్ట్ కూడా వీడియోలో మహిళను అమీనా బేగంగా గుర్తించాయి.

ఐతే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నిరసన నేపథ్యంలో ఆందోళనను చేస్తున్న స్టూడెంట్స్ ఒత్తిడి వల్ల న్యాయమూర్తులు రాజీనామా చేసినట్టు వార్తా కథనాలు ఉన్నాయి. ఈ న్యాయమూర్తులు కూడా ముస్లింలే. ఐతే వైరల్ పోస్ట్‌లో వాదిస్తున్నట్టు హిందువులను టార్గెట్ చేసి రాజీనామా చేపిస్తున్నారనడానికి ఎలాంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, బంగ్లాదేశ్‌లో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా రాజీనామా చేయించిన ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll