Fake News, Telugu
 

బెంగాల్ మరియు తమిళనాడు 2021 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడాతో చాలా సీట్లు ఓడిపోయినట్టు తప్పు నంబర్లు ప్రచారం చేస్తున్నారు

0

ఇటివల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ‘1000 ఓట్ల తేడాతో BJP ఓడిన సీట్లు 92’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అదే విధంగా, తమిళనాడు ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో NDA కూటమి 300-1500 ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్తున్న మరొక పోస్టు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బెంగాల్ మరియు తమిళనాడు 2021 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడాతో చాలా సీట్లు ఓడిపోయింది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి చేసిన ఎన్నికల ఫలితాల ప్రకారం బెంగాల్ లో వెయ్యి ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయించబడిన మొత్తం స్థానాలు 7 కాగా, ఇందులో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే BJP ఓడిపోయింది. మిగతా నాలుగు స్థానాల్లో TMC ఓడిపోయింది. అదేవిధంగా, తమిళనాడు లో మొత్తం 13 స్థానాల్లో 1500లోపు ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయించబడింది. ఇందులో 9 స్థానాల్లో NDA కూటమి ఓడిపోయింది, మిగతా నాలుగు స్థానాల్లో DMK కూటమి ఓడిపోయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పశ్చిమ బెంగాల్ :

బెంగాల్ లో జరిగిన ఎన్నికలకి సంబంధించిన ఫలితాలు 02 మే 2021 రోజున వెలువడ్డాయి. ఐతే బెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజికవర్గాలలో 292 నియోజికవర్గాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం ఈ 292 నియోజకవర్గాలకు గాను TMC 213 నియోజకవర్గాలలో గెలుపొందింది, BJP 77 నియోజకవర్గాలలో గెలుపొందింది.

ఐతే ఎన్నికల సంఘం ప్రకారం, వెయ్యి ఓట్ల తేడాతో బెంగాల్ లో ఫలితం నిర్ణయించబడిన నియోజకవర్గాలు కేవలం 7 మాత్రమే, పోస్టులో చెప్తున్నట్టు 92 కాదు. ఈ ఏడింటిలో కూడా BJP కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది, మిగతా నాలుగు స్థానాలలో TMC వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది.

దంతన్ (623 ఓట్లు), జల్పైగురి (941 ఓట్లు) మరియు తమ్లుక్ (793 ఓట్లు) నియోజకవర్గాలలో BJP వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోగా, TMC  బలరాంపూర్ (423 ఓట్లు), దిన్హత (57), ఘతల్ (966 ఓట్లు) మరియు కుల్తి (679) నియోజకవర్గాల్లో వెయ్యి లోపు వోట్ల తేడాతో ఓడిపోయింది.

తమిళనాడు :

02 మే 2021న వెలువడ్డ తమిళనాడు ఎన్నికల ఫలితాలలో DMK కూటమి 159 సీట్లతో గెలుపొందగా, AIADMK కూటమికి 75 సీట్లు వచ్చాయి.

ఐతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం తమిళనాడు ఎన్నికల్లో 1500 ఓట్ల లోపు తేడాతో ఫలితం నిర్ణయించబడిన స్థానాలు కేవలం 13 మాత్రమే, పోస్టులో చెప్తునట్టు 50 కాదు. ఈ 13 స్థానాల్లో NDA కూటమి 1500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది 9 స్థానాలు కాగా, DMK కూటమి నాలుగు స్థానాల్లో ఓడిపోయింది.

NDA కూటమి 1500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాల్లో అన్తియుర్ (1275 ఓట్లు), జోలర్పెట్ (1091 ఓట్లు), కట్పడి (746 ఓట్లు), తెంకసి (370 ఓట్లు), తిరుమాయం (1382 ఓట్లు), తియగరయనగర్ (137 ఓట్లు) స్థానాలలో AIADMK ఓడిపోగా కేవలం ధరపురం (1393 ఓట్లు) స్థానంలో లో మాత్రమే BJP 1500 లోపు తేడాతో ఓడిపోయింది. NDA కూటమిలోని PMK నెయ్వేలి (977 ఓట్లు), వ్రిద్ధాచలం (862 ఓట్ల) రెండు స్థానాల్లో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదేవిధంగా కినాతుకాడవు (1095 ఓట్లు), క్రిష్ణగిరి (794 ఓట్లు), మెట్టుర్ (656 ఓట్లు) మరియు మొదక్కురిచి (281 ఓట్లు) స్థానాల్లో DMK 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

చివరగా, బెంగాల్ ఎన్నికల్లో BJP వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయింది కేవలం 3 సీట్లలో మాత్రమే; అదేవిధంగా తమిళనాడులో NDA కూటమి 1500 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది 9 మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll