బీఆర్ఎస్ 18 స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదని నివేదికలు అందటంతో అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్టు కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రగతిభవన్ సిబ్బందికి సమాచారం అందించారని. నందిహిల్స్ లోని పాత ఇంటికి సామాన్లు తరలిస్తున్నారంటూ దిశ వార్త పత్రిక ఆర్టికల్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: బీఆర్ఎస్ 18 స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదని నివేదికలు అందటంతో కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేస్తున్నారు అంటూ దిశ పత్రిక ప్రచురించింది
ఫాక్ట్(నిజం): వైరల్ న్యూస్ ఆర్టికల్ కింద భాగంలో ఉన్న లింకును ఆధారంగా తీసుకొని వెతికితే, వేరే ఆర్టికల్‌కు దారి తీసింది. పైగా దిశ న్యూస్ యాజమాన్యం వైరల్ పోస్టు ఫేక్ అంటూ తమ వెబ్సైట్ మరియు X పోస్టు ద్వారా తెలిపారు అని గమనించాం. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ న్యూస్ ఆర్టికల్ కింద భాగంలో ఉన్న లింకును ఆధారంగా తీసుకొని వెతికితే, వేరే ఆర్టికల్‌కు దారి తీసింది. తరువాత వైరల్ పోస్టులో ఉన్న లింకు పైన ఉన్న తేదీ ఆధారంగా దిశ ఈ-న్యూస్ పేపర్ వెబ్సైటులో వెతికితే, అసలు ఆర్టికల్, వైరల్ పోస్టులో చూపించిన విధంగా రెండవ పేజీలో ఉండటంతో వైరల్ పోస్టు ఎడిట్ చెయ్యబడింది అని స్పష్టమైంది.
పైగా, దీని గురించి మరింత వెతికితే దిశ న్యూస్ యాజమాన్యం వైరల్ పోస్టు ఫేక్ అంటూ తమ వెబ్సైట్ మరియు X పోస్టు ద్వారా తెలిపారు అని గమనించాం. “బీఆర్ఎస్ 18 స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదని.దీంతో కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో దిశ పత్రిక పేరుతో ఫేక్ క్లిప్ ప్రచారం అవుతోంది. అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రగతిభవన్ సిబ్బందికి కేసీఆర్ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ఈ వార్తలో పేర్కొన్నారు. నందిహిల్స్లోని పాత ఇంటికి సామాన్లు తరలించాలని చూస్తున్నారని… అయితే, సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న ఈ క్లిప్కు దిశ పత్రికకు ఎలాంటి సంబంధం లేదని. దిశ పత్రిక రెగ్యూలర్ ఎడిషన్లో గానీ, డైనమిక్ ఎడిషన్లలో కానీ ఎక్కడ పై వార్తను ప్రచురించలేదని యాజమాన్యం స్పష్టం చేసింది” అంటూ దిశ ప్రచురించింది.
చివరిగా, దిశ పత్రిక పేరుతో, ‘ప్రగతిభవన్ ఖాళీ చేస్తున్న కేసీఆర్’ అంటూ తప్పుడు వార్తను షేర్ చేస్తున్నారు.