Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌ చూపించినప్పటికీ, ఆ రాష్ట్ర అప్పులు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి

0

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం 74,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఉత్తరప్రదేశ్ మిగులు బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్రం అప్పులతో పోల్చుతూ ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని చెప్పే ప్రయత్నం ఈ పోస్టులో చేసారు. ఈ కథనం పోస్టులో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఇలాంటి ఒక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో లక్షల కోట్ల అప్పులు చేయగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరం 74,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌ ద్వారా ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తుంది.

ఫాక్ట్(నిజం): ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2006 నుండే రెవిన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో రెవిన్యూ మిగులు ఉన్నప్పటికీ రుణాలు కూడా చేసారు. RBI గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ చెల్లించాల్సిన రుణాల విలువ తెలంగాణ కన్నా సుమారు రెండు రెట్లు అధికంగా ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ చేసే రుణాలు కూడా ప్రతీ ఏడు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఉత్తరప్రదేశ్ మిగులు బడ్జెట్ :

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఇటీవల 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టే బడ్జెట్‌లో రూ.74,147 కోట్ల (GSDPలో 3%) రెవిన్యూ మిగులును చూపించింది.

సాధారణంగా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన వ్యయం (ఖర్చు) కన్నా ప్రభుత్వానికి సమకూరే ఆదాయాలు ఎక్కువగా ఉంటే దానిని రెవిన్యూ మిగులు బడ్జెట్‌ అంటారు. అంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వెచ్చించే మొత్తం కంటే పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే ఎక్కువ అని అర్థం.

ఐతే ఉత్తరప్రదేశ్ ఇలా మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదేం మొదటిసారి కాదు. 2006 నుండే ఉత్తరప్రదేశ్ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తుంది (ఇక్కడ & ఇక్కడ). సహజంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో  డిమాండ్‌ను తగ్గించడానికి ఈ మిగులు బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. కానీ, ఇతర సమయాల్లో ఈ రెవిన్యూ మిగులును మౌలిక సదుపాయాలు అందించటం కోసం ఖర్చు (క్యాపిటల్ ఎక్ష్పెన్డిచర్) చేస్తే మంచిదని నిపుణుల అభిప్రాయం.

ఈ మిగులును తెలంగాణ అప్పులతో పోల్చడం కరెక్ట్ కాదు:

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికి, దీని అర్ధం రాష్ట్రానికి అప్పులు లేవని కాదు. నిజానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు లక్షా పదకొండు వేల కోట్ల మేరకు నిధులను రుణాల ద్వారా సేకరించనున్నట్టు తెలిపింది. గత అప్పులకు సంబంధించి కొన్ని చెల్లింపులు చేస్తున్నప్పటికీ, కొత్తగా రుణాలు కూడాతీసుకోనున్నట్టు పేర్కొంది.

ఇకపోతే తెలంగాణ రాష్ట్ర అప్పుల ప్రస్తావనకు సంబంధించి, RBI  గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ నికర అప్పులు తెలంగాణ అప్పుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రం కాబట్టి అప్పులు ఎక్కువ ఉండడం కూడా సహజమే. RBI డేటా ప్రకారం 2024 బడ్జెట్‌ అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన మొత్తం రుణాల నికర విలువ రూ. 3,89,672.5 కోట్లు కాగా, ఉత్తరప్రదేశ్ మొత్తం రుణాల నికర విలువ రూ. 7,69,245.3 కోట్లుగా ఉంది.

ఐతే ఈ నికర విలువలో గత ప్రభుత్వాలు చేసిన రుణాలు కూడా ఉండడం, వాటిలో ఈ ప్రభుత్వం కొంతవరకు చెల్లించడం జరిగినప్పటికీ, 2017లో మొదటిసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చుస్తే ప్రతీ సంవత్సరం ఉత్తరప్రదేశ్ చెల్లించాల్సిన రుణాల విలువ పెరుతుండడం గమనించొచ్చు. అంటే మిగులు బడ్జెట్‌ ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా ప్రతీ ఏడు రుణాలు చేస్తుందని, పైగా రుణాల విలువ ప్రతీ ఏడు క్రమంగా పెరుగుతూ వస్తుందని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ మిగులు బడ్జెట్‌ చూపించినప్పటికీ, రాష్ట్ర అప్పులు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll