నల్లమలలోని యురేనియం నిల్వల పై గత కొద్ది రోజులుగా న్యూస్ ఛానలల్లో మరియు సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొందరు అడవులను కాపాడాలంటూ ‘#SaveNallamala’ అని పోస్టులు పెడుతుంటే, మరికొందరు యురేనియం వల్ల దేశానికి వచ్చే ప్రయోజనాల గురించి పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, ఒక కిలో యురేనియంతో హైదరాబాద్ వంటి మహానగరానికి ఏళ్ళ తరపడి నిరంతరమైన విద్యుత్ అందించవచ్చని పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : ఒక కిలో యురేనియంతో హైదరాబాద్ కి ఏళ్ళ తరబడి నిరంతమైన విద్యుత్ ని అందించవచ్చు.
ఫాక్ట్ (నిజం): ఒక రోజు హైదరాబాద్ నగరానికి సరిపోయే విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికే సుమారు 135 కిలోల ‘enriched’ యురేనియం కావాలి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
ముందుగా, హైదరాబాద్ నగరం ఒక సంవత్సరంలో ఎంత విద్యుత్ ఉపయోగిస్తుందో చూద్దాం. ప్రభుత్వ సంస్థలు మరియు వార్తాసంస్థలు ప్రచురించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరం రోజుకి సగటున సుమారు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడుతుంది (వాతవరణం బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అంటే ఎండా కాలం లో ఇంకా చాలా ఎక్కువ వాడకం జరగొచ్చు), అంటే నెలకు సగటున సుమారు 1200 మిలియన్ యూనిట్లు (కొన్ని నెలల్లో 2000 మిలియన్ యూనిట్లు కూడా వాడినట్టు ఇక్కడ చదవచ్చు).
ఇప్పుడు, ఒక కేజీ యురేనియంతో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయచ్చో తెలుసుకుందాం. గూగుల్ లో వెతకగా, ఈ విషయం పై 2014 లో లోక్ సభ లో అడిగిన ఒక ప్రశ్నకి మోడీ ప్రభుత్వంలోని మినిస్టర్ డా. జితేంద్ర సింగ్ (‘Minister of State for Personnel, Public Grievances & Pensions And Prime Minister’s Office’) సమాధానమిచ్చినట్టు తెలుస్తుంది. ఆ సమాధానం ప్రకారం, 3.4 కిలోల ‘enriched’ యురేనియం తో 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ (1000 MW కెపాసిటీ లైట్ వాటర్ రియాక్టర్ సహాయం తో) ని ఉత్పత్తి చేయవచ్చు. రియాక్టర్ సామర్థ్యం బట్టి కావాల్సిన యురేనియం పరిమాణం కూడా మారుతుంది. ఉదాహరణకు, లోక్ సభ లో ప్రభుత్వం ఇచ్చిన అదే సమాధానం లో 160 MW కెపాసిటీ రియాక్టర్ అయితే 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరకు 6.5 కిలోల ‘enriched’ యురేనియం అవసరం అవుతుంది.
హైదరాబాద్ నగరానికి ఒక నెలకు కావలసిన విద్యుత్ (సుమారు 1200 మిలియన్ యూనిట్లు) ని మరియు 3.4 కిలోల ‘enriched’ యురేనియంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ (1 మిలియన్ యూనిట్ల విద్యుత్) ని కలిపి చూడగా, ఒక నెల హైదరాబాద్ నగరానికి సరిపోయే విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికి కనిష్టంగా సుమారు 4050 కిలోల ‘enriched’ యురేనియం కావాలని తెలుస్తుంది. అంటే, ఒక్క రోజు హైదరాబాద్ నగరానికి సరిపోయే విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికే సుమారు 135 కిలోల ‘enriched’ యురేనియం కావాలి. కావున, ఒక కిలో యురేనియంతో హైదరాబాద్ వంటి నగరానికి కొన్ని ఏళ్ళ పాటు విద్యుత్ అందించవచ్చని చెప్పడం తప్పు.
చివరగా, ఒక కిలో యురేనియంతో హైదరాబాద్ వంటి నగరానికి ఒక్క రోజు కూడా సరిగ్గా విద్యుత్ అందించలేము.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఒక కిలో యురేనియంతో హైదరాబాద్ వంటి నగరానికి ఒక్క రోజు కూడా సరిగ్గా విద్యుత్ అందించలేము - Fact Checking Tools