Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించిన రాహుల్‌కి కూడా నజరానా ప్రకటించింది

0

కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్‌కి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక నజరానా ఇవ్వలేదు, కాని సిల్వర్ మెడల్ సాధించిన సింధూకి మాత్రం సబ్ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిందని చెప్తూ, ప్రభుత్వం కొందరు క్రీడాకారుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రభుత్వం కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాహుల్‌కి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక నజరానా ఇవ్వలేదు.

ఫాక్ట్ (నిజం): 2018 కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన రాగల వెంకట్ రాహుల్‌కి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షల రూపాయల నగదు మరియు గ్రూప్ 2 ఉద్యోగం బహుమతిగా ప్రకటించింది. పైగా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

రాగల వెంకట్ రాహుల్:

రాగల వెంకట్ రాహుల్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో 85kg వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఐతే పతకం సాధించిన రాహుల్ తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నప్పుడు అతనికి మంత్రులు మరియు ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

వార్తా కథనాల ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు పతకం సాధించిన రాహుల్‌కి 50 లక్షల రూపాయల నగదు మరియు గ్రూప్ 2 ఉద్యోగం బహుమతిగా ప్రకటించింది. అధనంగా తను ఒక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి 1 కోటి రూపాయలు కూడా ప్రకటించింది, పైగా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టు కూడా వార్తా కథనాలు రాసాయి. అంతకు ముందే 2 ఎకరాల భూమి కూడా ఇచ్చినట్టు ఈ కథనం ద్వారా తెలుస్తుంది.

పి.వి. సింధు:

పోస్టులోని సింధు ఫోటో 2016 రియో ఒలింపిక్స్ లో పతకం సాధించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నపుడు విమానాశ్రయంలో తీసింది. సింధూ రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినందుకు గాను రెండు తెలుగు ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు, అమరావతిలో 1,000 చదరపు అడుగుల ఇంటి స్థలం మరియు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ప్రకటించింది. ఆ తర్వాత సింధూ ఆంధ్రప్రదేశ్ లో సబ్ కలెక్టర్ ఉద్యోగంలో కూడా చేరింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 5 కోట్ల రూపాయలు మరియు 1,000 చదరపు అడుగుల స్థలం బహుమతిగా ప్రకటించింది.

ఐతే పోస్టులో చెప్పినట్టు రాహుల్ కి ప్రభుత్వం ఎటువంటి నజరానా ప్రకటించలేదని, ప్రభుత్వం కొందరు క్రీడాకారుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుంది అన్న వాదనలో నిజం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాదించిన రాహుల్ కి కూడా నజరానా ప్రకటించింది.

Share.

About Author

Comments are closed.

scroll