ఇటీవల ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలకు చేకూరిన డొనేషన్ల వివరాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ వివరాల ప్రకారం 2019లో పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్‌కు చెందిన ‘హబ్ పవర్ కంపెనీ’ అనే సంస్థ బీజేపీకు విరాళాలు అందించిందన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ సంస్థ అందించిన విరాళాల స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలెక్టోరల్ బాండ్స్ వివరాల ప్రకారం 2019లో పాకిస్తాన్‌కు చెందిన ‘హబ్ పవర్ కంపెనీ’ అనే సంస్థ బీజేపీకు విరాళాలు ఇచ్చింది.
ఫాక్ట్(నిజం): GST పోర్టల్ ప్రకారం, ‘హబ్ పవర్ కంపెనీ’ అనేది ‘రవి మెహ్రా’ పేరుతో నమోదు చేయబడిన ప్రొప్రైటర్‌షిప్ సంస్థ. 2018లో ఢిల్లీలో స్థాపించబడిన దీనికి పాకిస్థాన్‌కు చెందిన ‘హబ్ పవర్ కంపెనీ లిమిటెడ్’తో ఎలాంటి సంబంధం లేదు. ఢిల్లీకు చెందిన సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తానీ సంస్థ స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం SBI ఎన్నికల సంఘానికి ఎలెక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన వివరాలు అందించింది. ఆ తరవాత ఎన్నికల సంఘం ఈ వివరాలను బహిర్గతం చేసింది. ఐతే ఈ వివరాల ప్రకారం ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో ప్రస్తావించిన ‘హబ్ పవర్ కంపెనీ’ అనే సంస్థ విరాళాలు అందించిన విషయం నిజమే అయినప్పటికీ, ఈ కంపెనీకు పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధం లేదు.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్:
ప్రస్తుతం అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రకారం, ఈ బాండ్‌లను దేశంలో నమోదైన ఏదైనా భారతీయ సంస్థ కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఏదైన విదేశీ కంపెనీ భారతదేశంలో నమోదు చేసుకున్న దాని అనుబంధ సంస్థల ద్వారా ఈ బాండ్‌లను పొందవచ్చు.
దీని ప్రకారం ఈ ‘హబ్ పవర్ కంపెనీ’ అనే సంస్థకు సంబంధించిన వివరాలకు కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో వెతకగా ఈ కంపెనీకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ కంపెనీ నిజంగా పాకిస్తానీ సంస్థ యొక్క అనుబంధ సంస్థ అయ్యుంటే, దాని వివరాలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండాలి, కానీ మాకు అలాంటి వివరాలు ఏవి లభించలేదు.
కాగా, ఇండియా మార్ట్‌లో ‘హబ్ పవర్ కంపెనీ’ పేరుతో వెతకగా మాకు ఈ కంపెనీ యొక్క GST నంబర్ లభించింది. ఈ వివరాల ఆధారంగా GST వెబ్‌సైట్‌లో వెతకగా, ఇది 2018లో రిజిస్టర్ అయిన ఢిల్లీకి చెందిన కంపెనీ అని తెలిసింది. ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ‘రవి మెహ్రా’ పేరుతో రిజిస్టర్ అయిన ప్రొప్రైటర్‌షిప్ సంస్థ. దీన్నిబట్టి ఇది ఒక విదేశీ సంస్థ యొక్క అనుబంధ సంస్థ కాదన్న విషయం స్పష్టమవుతుంది.
పాకిస్థాన్ ‘హబ్ పవర్ కంపెనీ’ వివరణ ఇచ్చింది:
ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో ‘హబ్ పవర్ కంపెనీ లిమిటెడ్ (HUBCO)’ పేరుతో ఒక పవర్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల నేపథ్యంలో భారత్‌లో ఎలెక్టోరల్ బాండ్‌ల విషయంలో ప్రచారంలో ఉన్న ‘హబ్ పవర్ కంపెనీ’ సంస్థకు తమకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసింది.
చివరగా, ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందించిన ‘హబ్ పవర్ కంపెనీ’ అనేది ఢిల్లీలో రిజిస్టర్ అయిన ఒక ప్రొప్రైటర్‌షిప్ సంస్థ.