నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్న బై- ఎలెక్షన్ నేపథ్యంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాఓ విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలలోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
ఈ వీడియోలో BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘నిజంగా,నా పనైపోయింది, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి అర్థమైపోయింది… ’ అని చెప్తున్నట్లు ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందొ ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్ 1: ‘నిజంగా, నా పనైపోయింది, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ఉండదని అర్థమైపోయింది..’ అని అన్న, మునుగోడు బై-ఎలక్షన్ BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఫాక్ట్ (నిజం): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్టోబర్ 21న జరిగిన ఒక ప్రెస్స్ మీట్లో మాట్లాడుతూ ‘నిజంగా, నా పనైపోయింది, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణాలో కేసీఆర్ అనే వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి ఆయనకు అర్థం అయిపోయింది, ఎన్ని సర్వేలు చేయించినా రోజురోజుకి, రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుందని అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి’ అని అన్నారు. ఈ వీడియోలోని కొన్ని భాగాలని ఎడిట్ చేసి ఆయన తన పని అయిపోయింది అని తన గురించి చెప్పినట్లు అర్థం వచ్చేలాగా వైరల్ వీడియోని తయారు చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
సరైన కీ వర్డ్స్ ఉపయోగించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్టులో ఉన్నట్లు అన్నారు అని ఇంటర్నెట్లో వెతకగా, అక్టోబర్ 21వ తారీఖున ప్రెస్ మీట్లో అయన మాట్లాడిన వీడియో ఒకటి లభించింది. వీడియోలోని 0:13 సెకన్ల మార్కు నుండి వైరల్ వీడియోలో ఉన్న మాటలు చెప్పారు. కానీ వైరల్ వీడియోకి, ఇందులో అయన మాట్లాడిన మాటలకి వ్యతాసం ఉంది.
ప్రెస్ మీట్ వీడియోలో రాజగోపాల్ రెడ్డి ‘నిజంగా, నా పనైపోయింది, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణాలో కేసీఆర్ అనే వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి ఆయనకు అర్థం అయిపోయింది, ఎన్ని సర్వేలు చేయించినా రోజురోజుకి, రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుందిన అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి’ అని అన్నట్లు వీడియోలో ఉంది.
ప్రెస్స్ మీట్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్ని తన పని అయిపోయింది అని తన గురుంచి చెప్పుకుంటున్నట్లుగా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.
మరొక వీడియోలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మునుగోడు TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా వస్తుందో రాదో నాకైతే అనుమానమే …’ అని చెప్తున్నట్లు షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్ 2: TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మునుగోడు TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా వస్తుందో రాదో నాకైతే అనుమానమే …’ అని అన్నారు.
ఫాక్ట్ (నిజం): కేటీఆర్ చౌటుప్పల్ లో నిర్వహించిన రోడ్ షోలో చేసిన ప్రసంగం వీడియోని, తాను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అసలు డిపాజిట్ కూడా వస్తుందో రాదో అని అనుమానం వ్యక్తపరిచినట్లుగా, అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అని అన్నట్లుగా ఎడిట్ చేసారు. పూర్తి ప్రసంగం వీడియోలో కేటీఆర్ ప్రతిపక్ష నాయకుల గురించి అలా అన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
సరైన కీ వర్డ్స్ ఉపయోగించి కేటీఆర్ స్పీచ్ కోసం ఇంటర్నెట్లో వెతకగా, అక్టోబర్ 21వ తారీఖున నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ లో నిర్వహించిన రోడ్ షోలో అయన మాట్లాడిన వీడియో ఒకటి లభించింది.
కేటీఆర్ ఈ ప్రసంగంలో వివిధ సమయాలలో చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి పోస్టులో చేసిన వీడియో తయారు చేసినట్టు తెలుస్తుంది. వీడియోలో 1:24 దగ్గర కేటీఆర్, “ముఖ్యంగా మా యువ సోదరులు, మా తమ్ముళ్లు, మీ ఊపు మీ జోష్ చూస్తుంటే, అవతల కాంగ్రెసుకు,బీజేపీకి డిపాజిట్ కూడా వస్తుందో రాదో నాకైతే అనుమానమే కొడుతున్నది” అని అన్నారు.
అలాగే 14:17 దగ్గర, “….బాగా నీల్గుతున్నాడు రాజగోపాల్ రెడ్డి, నిన్న మొన్న తెలిసింది మాకు, ఏమంటుండంటే ఎరికేనా? అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి, అవి వాని పైసలు కాదు, గుజరాత్ కెళ్ళి వస్తున్నాయి……. ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి, మునుగోడు ఆత్మ గౌరవాన్ని కొనటానికి వేస్తున్న ఎర. అందుకే అంటా ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆయన డబ్బు మదం డబ్బు అహంకారం ఏదయితే ఉన్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన అవసరం మన మీద ఉన్నది” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలని ఎడిట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా పోస్టులోని వీడియో తయారు చేసారు. అలాగే ఈ వీడియోలో హరీష్ రావు క్లిప్ అక్టోబర్ 16వ తేదీన తన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల నుంచి తీసుకున్నారు.
చివరిగా, మునుగోడు అసెంబ్లీ బై – ఎలక్షన్ నేపథ్యంలో నాయకుల ప్రసంగాల వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు అర్థాలు వచ్చేలాగా షేర్ చేస్తున్నారు.