Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగాన్ని అడ్డగిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో తన ప్రసంగాన్ని అడ్డగించాలని ప్రయత్నించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో తన ప్రసంగాన్ని అడ్డగిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. 13 ఆగష్టు 2014 నాడు జరిగిన లోక్‌సభ సెషన్‌లోని రెండు వేర్వేరు సందర్భాలలో తీసిన వీడియో క్లిప్పులని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోలో కనిపిస్తున్నవి 13 ఆగష్టు 2014 నాడు జరిగిన లోక్‌సభ సెషన్‌లోని దృశ్యాలని తెలిసింది. మతపరమైన హింసను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన విధానాల గురించి ఈ లోక్‌సభ సెషన్‌లో చర్చిస్తూ, బీజేపీ అలాగే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారం నిలబెట్టుకోవడానికి విభజించే ఎజెండాను అనుసరిస్తూ దేశంలో మతపరమైన అల్లర్లను ప్రేరిపిస్తున్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ లోక్‌సభ సెషన్ వీడియోని బీజేపీ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో కూడా పబ్లిష్ చేసింది. వీడియోలోని 10:24 నిమిషాల దగ్గర, ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఒక మహిళ నాయకురాలు యోగి ఆదిత్యనాథ్ ప్రసంగాన్ని అడ్డగించినప్పుడు, యోగి ఆదిత్యనాథ్ గంభీరంగా ఆమెని కూర్చోమని చెప్పిన దృశ్యాలని మనం చూడవచ్చు.

అలాగే, వీడియోలోని 13:24 నిమిషాల దగ్గర, ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ యోగి ఆదిత్యనాథ్ ప్రసంగాన్ని అడ్డగిస్తూ, మతపరమైన అల్లర్లకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో తప్పుడు లెక్కలు తెలుపుతున్నారని ఆరోపిస్తూ, అప్పటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకి చెప్తున్న దృశ్యాలు చూడొచ్చు. 14:02 నిమిషాల దగ్గర, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఒవైసీని తన అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి కూర్చోమనప్పుడు, ఒవైసీ తన సీటులో కూర్చున్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియోని 13 ఆగష్టు 2014 నాడు జరిగిన లోక్‌సభ సెషన్‌లోని రెండు వేర్వేరు సందర్భాలలో తీసిన వీడియో క్లిప్పులని ఎడిట్ చేసి రుపొందిచారు.

మతపరమైన అల్లర్లకు సంబంధించి 13 ఆగష్టు 2014 నాడు లోక్‌సభలో జరిగిన ఈ చర్చకు సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగాన్ని అడ్డగిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll