ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ నుండి దిగి ప్రజలకు అభివాదం చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ ప్రజలెవరూ లేకున్నా కూడా ఉన్నట్టు ఖాళీ మైదానానికి మోదీ చేతులూపుతూ అభివాదం తెలుపుతున్నాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రజలెవరూ లేని ఖాళీ మైదానానికి చేతులూపుతూ మోదీ అభివాదం తెలుపుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ప్రధాని మోదీ బెంగాల్ లోని జయనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనప్పటిది. BJP తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ ప్రచారానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఐతే ఈ వీడియోలో మోదీ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకి అభివాదం చేస్తుండడం స్పష్టంగా చూడొచ్చు, పైగా ఈ వీడియోలో ప్రజల అరుపులు కూడా వినొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, BJP అధికారిక ఫేస్ బుక్ పేజీలో బెంగాల్ లోని జయనగర్ లో మోదీ జరిపిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసిన పోస్టు మాకు కనిపించింది. ఈ వీడియోలో మరియు పోస్టులో ఉన్న వీడియోలో ఒకే విజువల్స్ ఉండడం గమనించొచ్చు. దీన్నిబట్టి, పోస్టులోని వీడియో BJP తమ ఫేస్ బుక్ పేజీ షేర్ చేసిన వీడియో నుండి సేకరించిందని అర్ధం చేసుకోవచ్చు. ఐతే ఈ వీడియోలో మోదీ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తుండడం స్పష్టంగా చూడొచ్చు, పైగా ఈ వీడియోలో ప్రజల అరుపులు కూడా వినొచ్చు.
ఇదే వీడియోని పలువురు BJP నేతలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా షేర్ చేసారు. BJP అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో కూడా ఈ వీడియో షేర్ చేసారు. ఐతే ఈ వీడియోలలో కూడా ప్రజలు మరియు వారి అరుపులు స్పష్టంగా గమనించొచ్చు. దీన్నిబట్టి, BJP షేర్ చేసిన మోదీ ప్రచార వీడియోని ప్రజలు కనబడకుండా మరియు మరియు వారి అరుపులు వినబడకుండా డిజిటల్ గా ఎడిట్ చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం బెంగాల్ తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరగా, బెంగాల్ లో జరిగిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోని డిజిటల్ గా ఎడిట్ చేసి ప్రధానమంత్రి మోదీ ఖాళీ మైదానానికి అభివాదం చేస్తున్నాడని తప్పుగా షేర్ చేస్తున్నారు.