“కాంగ్రెస్ అంటే అన్నీ స్కీములే, BRS అంటే అన్ని స్కాములే” అని ఒక సభలో కేసీఆర్ ముందు మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజం ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: BRS మంత్రి మల్లా రెడ్డి తన సొంత పార్టీని విమర్శిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. 18 అక్టోబర్ 2023న మేడ్చల్లో జరిగిన BRS సభలో మంత్రి మల్లా రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాల్ని ఎడిట్ చేసి తాను BRSని విమర్శించినట్లు అర్థం వచ్చేలాగ ఈ వీడియోని తయారు చేసారు. నిజానికి తన ప్రసంగంలో మల్లా రెడ్డి BRS పార్టీనీ, సీఎం కేసీఅర్ని ప్రశంసించారు. కావున పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సరైన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో ఇటీవల మంత్రి మల్లా రెడ్డి చేసిన ఒక ప్రసంగంలో నుండి కొన్ని క్లిప్స్ తీసుకొని తయారు చేసినది అని తెలిసింది.

వివరాల్లోకి వెళితే 18 అక్టోబర్ 2023న BRS పార్టీ మేడ్చల్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీని, సీఎం కేసీఅర్ని ప్రశంసించారు. ఈ ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ ప్రసంగంలోని కొన్ని భాగాల్ని తీసుకొని వాటిని ఎడిట్ చేసి, తను BRS పార్టీని విమర్శిస్తున్నట్లు అర్థం వచ్చే లాగా వైరల్ వీడియోని తయారు చేసారు . వైరల్ వీడియోలో ఉన్న వరుస క్రమంలో ఒరిజినల్ ప్రసంగంలో వచ్చే వాక్యాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1:19– కేసీఅర్ గారి నేతృత్వంలో.
6:04– దళితులు ఉన్నారు,ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు…..
7:04– కాంగ్రెస్ అంటే అన్ని స్కాములే, BRS అంటే అన్ని స్కీములే.
చివరిగా, BRS మంత్రి మల్లా రెడ్డి మేడ్చల్ సభలో చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి, తాను BRS పార్టీనీ, సీఎం కేసీఅర్ని విమర్శించినట్లు అర్థం వచ్చేలాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.