Fake News, Telugu
 

2020 వీడియోని ఎడిట్ చేసి ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షాను విలేకరి నిలదీసినట్టు షేర్ చేస్తున్నారు

0

“ఇక్కడ వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి కానీ, కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఫండ్ కూడా రాలేదు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చావు”, అని ఒక విలేకరి ఇటీవల అమిత్ షాను ప్రశ్నించిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. 14 మే 2022 నాడు బీజేపి తెలంగాణలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఒక విలేకరి ఇటీవల అమిత్ షాను నిలదీసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 2020 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా హైదరాబాదులో ర్యాలీ నిర్వహిస్తుండగా ‘V6’ న్యూస్ ఛానల్ విలేకరి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. “వర్షాలకు హైదరాబాద్ వరదలలో మునుగుతున్నప్పటికి కేంద్రం ఎటువంటి సహాయం అందించటం లేదని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి?”, అని ‘V6’ విలేకరి అమిత్ షాని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ తాము అన్ని నగరాలకన్నా హైదరాబాదుకే ఎక్కువ ఆర్ధిక సహాయం అందించామని చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూ వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి ఈ వీడియోని రుపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, 2020 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా హైదరాబాదులో ర్యాలీ నిర్వహిస్తుండగా ‘V6’ న్యూస్ ఛానల్ విలేకరి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోని ‘V6’ న్యూస్ ఛానల్ 29 నవంబర్ 2020 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది.

ఈ వీడియోలోని 0:39 సెకండ్ల దగ్గర, “వర్షాలకు హైదరాబాద్ వరదలలో మునుగుతున్నప్పటికి కేంద్రం ఎటువంటి సహాయం అందించటం లేదని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి?”, అని ‘V6’ విలేకరి అమిత్ షాను ప్రశ్నించిన దృశ్యాలని చూడవచ్చు. విలేకరి అడిగిన ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ మేము అన్ని నగరాల కన్నా హైదరాబాదుకే ఎక్కువ ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారని అమిత్ షా ప్రశ్నించారు. ఈ వీడియోని ‘V6’ న్యూస్ ఛానల్ తమ ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేసింది. పూర్తి ఇంటర్వ్యూ వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి హైదరాబాదుకు నిధులు కేటాయించకపోవడానికి సంబంధించి ఒక విలేకరి అమిత్ షాను ఇటీవల నిలదీసిన దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

చివరగా, 2020 వీడియోని ఎడిట్ చేసి ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్ షాను విలేకరి నిలదీసినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll