Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఆర్టికల్‌ని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఇంటర్ పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు ‘way2news’ పోర్టల్ పబ్లిష్ చేసినట్టు కనిపిస్తున్న ఒక షార్ట్ ఆర్టికల్ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 25 నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్రంలో కరోనా మూడో దశ తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఇంటర్ పరీక్షలని వాయిదా వెయ్యాలని ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. అంతేకాదు, ఈ విషయంపై హైకోర్టు 15 అక్టోబర్ 2021 నాడు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్నఈ ఆర్టికల్‌ని ప్రచారం చేస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ వీడియోలని పబ్లిష్ చేసాయి. ఈ ‘way2news’ ఆర్టికల్‌కు సంబంధించి వాస్తవాలు తెలుపమని FACTLY వాట్సాప్ టిప్‌లైన్ (+91 9247052470) నెంబర్‌కి పలువురు యూసర్లు మెసేజ్ చేసారు. ఈ ఆర్టికల్‌ రిపోర్ట్ చేసిన వార్తలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వెయ్యాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ ‘way2news’ ఆర్టికల్ స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది. భూఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో 01 మే 2021 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈటెల రాజేందర్‌ని ఆరోగ్య మంత్రి పదవి నుండి తొలగించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖని ప్రస్తుతం కేసీఆర్ చూసుకుంటున్నారు. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వేసే యోచన ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన షార్ట్ ఆర్టికల్ కోసం ‘way2news’ మొబైల్ అప్లికేషన్లో వెతికితే, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందని రిపోర్ట్ చేస్తూ ‘way2news’ ఎటువంటి షార్ట్ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఒకవేళ పోస్టులో తెలుపుతున్న సమాచారం వాస్తవం అయ్యుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఏ ఒక్క వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన షార్ట్ ఆర్టికల్‌లోని అలైన్మెంట్ మరియు ఫాంట్ ‘way2news’ పబ్లిష్ చేసే షార్ట్ ఆర్టికల్స్‌కు భిన్నంగా ఉన్నాయి. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్ ఎడిట్ చేయబడినదని స్పష్టంగా తెలుస్తుంది.

భూఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో 01 మే 2021 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటెల రాజేందర్‌ని ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖని ప్రస్తుతం కేసీఆర్ చూసుకుంటున్నారు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ తరుపున హుజురాబాద్ ఉపఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వెయ్యాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారని చేస్తున్న క్లెయిమ్ పూర్తిగా నిరాధారమైనవి. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఈటెల రాజేందర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 25 అక్టోబర్ 2021 నుండి ప్రారంభమవుతాయని తెలంగాణ ప్రభుత్వం 24 సెప్టెంబర్ 2021 నాడు ప్రకటించింది. అయితే, 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 25 అక్టోబర్ 2021న ప్రారంభమయ్యే ఇంటర్ పరిక్షలపై హైకోర్టు 15 అక్టోబర్ 2021 నాడు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, ఎడిట్ చేసిన ఆర్టికల్‌ని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వేస్తూ కొత్త నిర్ణయం తీసుకోనుందని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll