మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్ చీఫ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్‌లో రామ కథను బోధించచనున్నాడని, ఇందుకుగాను దుబాయ్‌లో రెండు రోజులు సెలవు ప్రకటించారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్‌లో రామ కథను బోధించనున్న రెండు రోజులు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఫాక్ట్(నిజం): దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త డా. బు అబ్దుల్లా ఆహ్వానం మేరకు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్‌లో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐతే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్బంగా దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి సెలవలు ప్రకటించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల బాగేశ్వర్ ధామ్ చీఫ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి దుబాయ్‌కు వెళ్లిన వార్త నిజమే అయినప్పటికీ, ఈ సందర్బంగా అక్కడి ప్రభుత్వం నాలుగు రోజులు సెలవలు ప్రకటించిందన్న వార్తలో నిజంలేదు. ఈ విషయానికి సంబంధించి సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్ పర్యటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.
ఈ కథనాల ప్రకారం దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త డా. బు అబ్దుల్లా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని దుబాయ్‌లో హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించాడని తెలిసింది. ఈ ఆహ్వానం మేరకు కృష్ణ శాస్త్రి దుబాయ్ వెళ్లినట్టు, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో రెండు రోజులు (24-25 మే) హనుమాన్ కథను బోధించనున్నట్టు రిపోర్ట్ చేసాయి. డా.బు. అబ్దుల్లా ఇలా హిందూ మత గురువులను తరచూ ఆహ్వానిస్తుంటాడని ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ). ఇదే విషయాన్ని బాగేశ్వర్ ధామ్ సర్కార్ మరియు డా.బు. అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.
కృష్ణ శాస్త్రి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు దృశ్యాలు ఇక్కడ & ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ వార్తకు సంబంధించిన ఏ వార్తా కథనం కూడా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి పాల్గొనే ధార్మిక కార్యక్రమాల సందర్బంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని మాత్రం రిపోర్ట్ చేయలేదు.
అలాగే దుబాయ్ సెలవులకు సంబంధించి అక్కడి ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ ప్రకారం కూడా ఈ తేదీలలో ఎలాంటి సెలవులు లేవు. దీన్ని బట్టి, దుబాయ్ ప్రభుత్వం ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమం సందర్బంగా సెలవు ప్రకటించిందన్న వార్తలో నిజంలేదని స్పష్టమవుతుంది.
చివరగా, దుబాయ్ ప్రభుత్వం ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ధార్మిక కార్యక్రమం సందర్బంగా రెండు రోజులు సెలవులు ప్రకటించలేదు.