టిప్పు సుల్తాన్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) DK శివకుమార్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. సమాధిని సందర్శించి తాను డిప్యూటీ సీఎంగా తన విధులను ప్రారంభించినట్లు ఫోటోతో పాటు ఉన్న వివరణ సూచిస్తుంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, DK శివకుమార్ ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా నియమించబడ్డారు. ఈ సందర్భంలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. అసలు, దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు DK శివకుమార్ డిప్యూటీ సీఎంగా విధులు ప్రారంభించేముందు టిప్పు సుల్తాన్ సమాధికి నివాళులు అర్పించారు.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 2019లో కాంగ్రెస్ నాయకుడు DK శివకుమార్ టిప్పు సుల్తాన్ సమాధిని సందర్శించినప్పటిది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఫోటోను గురించి మరింత సమాచారం కోసం, ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, “టిప్పు సుల్తాన్ – టైగర్ ఆఫ్ మైసూర్” పేరుతో ఉన్న Facebook పేజీలో ఇదే ఫోటో లభించింది. ఫోటో యొక్క అప్‌లోడ్ తేదీ నవంబర్ 2019, మరియు దాని వివరణ, “కర్ణాటక రాజకీయాల ట్రబుల్ షూటర్ Mr. DK శివకుమార్ శ్రీరంగపట్నంలో గొప్ప అమరవీరుడు టిప్పు సుల్తాన్ – టైగర్ ఆఫ్ మైసూర్‌కు నివాళులర్పించారు.”
టిప్పు జయంతిని రద్దు చేసి పాఠ్యపుస్తకాల్లో టిప్పు చారిత్రక ప్రాధాన్యతను తొలగించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2019 తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా DK శివకుమార్ టిప్పు సుల్తాన్ సమాధిని సందర్శించినట్లు అదే సంవత్సరంలో ప్రచురితమైన విజయ్ కర్ణాటక వారి వార్తా కథనం ధృవీకరిస్తుంది. ఇదే సంఘటనకు సంబంధించి TV9 కన్నడ ఒక వీడియో రిపోర్టు కూడా 2019లో ప్రచురించింది, దాన్ని ఇక్కడ చూడవచ్చు.
DK శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిప్పు సుల్తాన్ సమాధిని సందర్శించారని చెప్పడానికి మాకు విశ్వసనీయ సమాచారం ఏదీ దొరకలేదు.
చివరిగా, కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ టిప్పు సుల్తాన్ సమాధికి నివాళులు అర్పిస్తున్న పాత ఫోటో ఇటీవలదిగా షేర్ చేస్తున్నారు.