Fake News, Telugu
 

మద్యం మత్తులో ఢిల్లీ – లక్నో హైవేపై బుల్‌డోజర్‌తో టోల్ బూత్‌ను కూల్చేసిన వ్యక్తి ముస్లిం కాదు

0

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హపుర్ సమీపంలో ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై బుల్‌డోజర్‌కు టోల్ ఫీజు అడిగారని ఆగ్రహంతో ఏకంగా టోల్ బూత్‌ను కూల్చేసిన ఘటన రిపోర్ట్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఘటనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ బుల్‌డోజర్‌ నడిపిన వ్యక్తి ఒక ముస్లిం (సాజిద్ అలీ) అంటూ, అతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిందేమో అనుకోని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత టాక్స్ కట్టడం ఉండదనుకొని ఇలా టోల్ బూత్‌ను కూల్చేశాడని వార్తలు షేర్ చేస్తున్నారు (ఇక్కడ).

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ బూత్‌ను కూల్చేసిన సాజిద్ అలీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకొని ఆలా చేసాడు.

ఫాక్ట్(నిజం): ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ బూత్‌ను బుల్‌డోజర్‌తో కూల్చేసిన ఘటనలో నిందితుడి పేరు ధీరజ్, ఇతను ముస్లిం కాదు. ఇతను మద్యం మత్తులో ఇలా చేసాడు. పోలీసులు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ బూత్‌ను ఒక వ్యక్తి  బుల్‌డోజర్‌తో  కూల్చేసిన వార్త నిజమే అయినప్పటికీ ఆ డ్రైవర్ ముస్లిం మతానికి చెందిన వాడు కాదు. పైగా ఈ ఘటన జరగడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగాను కారణం కాదు. ఈ వార్తకు సంబంధించిన సమాచారం కోసం వెతకగా ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాలు ప్రకారం ఈ ఘటన ఢిల్లీ- లక్నో జాతీయ రహదారిపై హాపూర్ సమీపంలోని ఛజర్సీ టోల్ ప్లాజ్ వద్ద చోటుచేసుకుంది.  ఆ మార్గంలో వస్తున్న జేసీబీ ఆపరేటర్‌ ధీరజ్‌ టోల్‌ కట్టడానికి నిరాకరించాడు. ఈ క్రమంలోనే అతనికి టోల్‌బూత్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. అప్పుడే అతను జేసీబీతో టోల్‌బూత్‌ కొంత భాగాన్ని కూల్చేశాడు.  పోలీసుల కథనం ప్రకారం అతను మద్యం మత్తులోనే ఇలా చేసాడని కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ). ఈ ఘటనను రిపోర్ట్ చేసిన ఏ వార్తా కథనం కూడా నిందితుడు రాహుల్ గాంధీ వీడియో చూసి ఇలా చేసాడని రిపోర్ట్ చేయలేదు.

ఈ ఘటనకు సంబంధించిన వార్తను జిల్లా ఎస్పీ షేర్ చేసిన ట్వీట్‌లో కూడా నిందితుడి పేరు ధీరజ్ అని స్పష్టంగా పేర్కొన్నాడు (ఇక్కడ). ఈ విషయానికి సంబంధించి స్పష్టత కోసం పిల్ఖువా స్టేషన్ యొక్క SHOను మేము సంప్రదించగా, వారు కూడా జేసీబీ నడిపిన వ్యక్తి  పేరు ధీరజ్ అని తెలిపాడు. కాగా ఆ జేసీబీల యజమాని పేరు సాజిద్ అని తెలిపాడు. ఈ వివరాల ప్రకారం ఈ ఘటనకు చెందిన నిందితుడు ముస్లిం కాదని, అలాగే అతను మద్యం మత్తులో ఇలా చేసాడు గాని ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదని స్పష్టమవుతుంది.

చివరగా, మద్యం మత్తులో ఢిల్లీ – లక్నో హైవేపై బుల్‌డోజర్‌తో టోల్ బూత్‌ను కూల్చేసిన వ్యక్తి ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll