ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు అమ్మడం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టారు.
ఫాక్ట్ (నిజం): ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం మొదలుపెట్టింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు. 1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పీ.వీ.నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కొత్త ఆర్ధిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. 1991-92 లో ఇలా వాటాలు విక్రయించడం ద్వారా రూ. 3,038 కోట్ల సేకరించారు. 1999-2004 మధ్యకాలంలోని NDA హయాంలో (వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు) పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ మరియు ఒక ప్రత్యేక కాబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేసారు. 2004-05 నుండి 2013-14 మధ్య మొత్తం పది సంవత్సరాల కాలంలో లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం 50 కన్నా ఎక్కువ సార్లు ఇలా వాటాలు అమ్మడం ద్వారా సుమారు రూ. 1,14,045 కోట్లు సేకరించింది. అదే 2014-15 నుండి ఇప్పటి వరకు మోడీ నేతృత్వం లోని NDA ప్రభుత్వం వంద కన్నా ఎక్కువ సార్లు ఇలా వాటాలు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 3.3 లక్షల కోట్లు సేకరించింది, మన్మోహన్ సింగ్ హయాంలో వాటాలు అమ్మడం ద్వారా సేకరించినదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
సాధారణంగా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించి ప్రభుత్వ ఖర్చులకు డబ్బులు అందుబాటులో తేవడానికి, ఆ సంస్థలలో ఇతరులను భాగస్వామ్యం చేయడం వల్ల పోటితత్వాన్ని పెంపొందించి తద్వారా సంస్థ పనితీరు పెంచడానికి, సామాజిక రంగాల్లో ఖర్చు చేయడానికి కావలసిన డబ్బు సేకరించడానికి మొదలైన కారణాల వల్ల ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలు అమ్ముతుంటాయి. అప్పటి వరకు ఆర్ధిక వృద్దికి తోడ్పడతాయని స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తూ భారంగా మారడంతో 1991లో ప్రవేశపెట్టిన కొత్త ఆర్ధిక విధానం ద్వారా చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. 1991-92 లో ఇలా వాటాలు విక్రయించడం ద్వారా రూ.3,038 కోట్ల సేకరించారు.
1999-2004 మధ్యకాలంలోని NDA హాయాంలో (వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు) పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ మరియు ఒక ప్రత్యేక కాబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేసారు. 2003-04లో అప్పటి వరకు లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా ఏకంగా రూ. 15,547 కోట్లు అప్పటి అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం సేకరించింది.
2004-05 నుండి 2013-14 మధ్య మొత్తం పది సంవత్సరాల కాలంలో లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం 50 కన్నా ఎక్కువ సార్లు ఇలా వాటాలు అమ్మడం ద్వారా సుమారు రూ. 1,14,045 కోట్లు సేకరించింది. అదే 2014-15 నుండి ఇప్పటి వరకు మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం వంద కన్నా ఎక్కువ సార్లు ఇలా వాటాలు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 3.3 లక్షల కోట్లు సేకరించింది, మన్మోహన్ సింగ్ హయాంలో సేకరించినదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఇటీవల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు ఒక ఇన్సురన్స్ కంపెనీలో వాటాలు విక్రయించబోతున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పైగా 2021-22 ఆర్ధిక సంవత్సరానికిగాను వాటాలు విక్రయించడం ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల సేకరణ టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.
ఇటివల కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వాటాలు విక్రయించడానికి నిర్ణయించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
చివరగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం మొదలుపెట్టింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు.