Fake News, Telugu
 

‘తెలంగాణలో 17 జిల్లాలకే ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ’ అనేది ఫేక్ వార్త.

0

తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే, వాటిలో కేవలం 17 జిల్లాలకే కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపిందని చెప్తూ, ‘ఏ జిల్లాను తీసివేస్తారో, ఏ ఏ జిల్లాలను , ఏ ఏ జిల్లాలో కలుపుకొని సర్ధుబాటు చేసుకుంటారో పూర్తి నివేదికతో తెలంగాణ ప్రభుత్వాన్ని రమ్మని చెప్పిన కేంద్ర హోంశాఖ’ అని ఉన్న ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలో 17 జిల్లాలకే ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పిన దానికి ఎటువంటి ఆధారం లేదు. వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో 33 జిల్లాల పేర్లు ఉన్నాయి. ఆగష్టు 2018 లో తెలంగాణ కి సంబంధించి హోంశాఖ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో కూడా 31 జిల్లాల పేర్లు (రెండు కొత్త జిల్లాలు ఫిబ్రవరి 2019 లో ఏర్పడ్డాయి) ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి వెతకగా, అలాంటి ఆమోదం గురించి ఎక్కడా కూడా సమాచారం లేదు. వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో చూడగా, తెలంగాణకి సంబంధించి 33 జిల్లాల పేర్లు ఉన్నట్టు చూడవొచ్చు. అలానే కేంద్ర హోంశాఖ కి చెందిన ‘National Cyber Crime Reporting Portal’ లో పోస్టులో లేని జిల్లాల పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఆగష్టు 2018 లో తెలంగాణ కి సంబంధించి హోంశాఖ వారు రిలీజ్ చేసిన ఒక ఆర్డర్ లో కూడా 31 జిల్లాల పేర్లు (రెండు కొత్త జిల్లాలు (నారాయణపేట మరియు ములుగు) ఫిబ్రవరి 2019 లో ఏర్పడ్డాయి) మరియు జోన్ల గురించి ఉన్నట్టు చూడవొచ్చు. ఒకవేళ 33 జిల్లాలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపకుంటే, ఆ జిల్లాల పేర్లు హోమ్ శాఖ, సంబంధిత వెబ్ సైట్లలో మరియు ఆర్డర్లలో ఉండకూడదు.

The Telangana Districts (Formation) Act, 1974’ చట్టం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కొత్త జిల్లాలను ప్రకటించే అధికారం ఉంటుంది. ప్రస్తుతానికి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి, కొత్త జిల్లాలను ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.

చివరగా, ‘తెలంగాణలో 17 జిల్లాలకే ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ’ అనేది ఫేక్ వార్త.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll