Fake News, Telugu
 

2022లో గుజరాత్‌లో జరిగిన రెండు వేర్వేరు దొంగతనాలను ఉటంకిస్తూ, కచ్‌లోని మాకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఇటీవల ఒక ముగ్గురు ముస్లిం వ్యక్తులు దొంగతనం చేస్తూ కెమెరాకి దొరికారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

ముగ్గురు వ్యక్తులు ఒక ఆలయంలో దొంగతనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోని షేర్ చేస్తూ, ‘ఈ 👇 వార్త ఏదైనా మీడియాలో వచ్చిందా.? రాదు ఎందుకంటే మెజారిటీ ప్రజల సమస్య కాబట్టి కచ్‌లోని మాకేశ్వర్ మహాదేవ్ ఆలయయంలో విలువైన సంపదను దోచుకుంటున్న ముహమ్మద్, యూసుఫ్ , రజాక్ అనే ముష్కర ముఠా ఇంకా’ అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న మాకేశ్వర్ ఆలయంలో విలువైన సంపదను ముహమ్మద్, యూసఫ్, రజాక్ అనే వ్యక్తులు దొంగిలిస్తున్న CCTV వీడియో.

ఫ్యాక్ట్: ఈ వీడియో కచ్‌లో ఉన్న మాకేశ్వర్, నిజానికి మాక్లేశ్వర్ మహదేవ్ ఆలయంలో 2022లో జరిగిన దొంగతనానికి చెందినది కాదు. మాక్లేశ్వర్ మహదేవ్ ఆలయ దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు వారిలో ఒక్క ముస్లిం వ్యక్తి, ఇద్దరు హిందూ వ్యక్తుల పేర్లు ఉన్నాయి, అవి జుతుభాయి అర్జన్‌భాయ్ ఖేర్, సమందర్ ఖాన్ చంద్ ఖాన్ పఠాన్, కల్పేష్ ప్రకాష్‌భాయ్ నాట్. ఇకపోతే, వీడియోలో కనిపిస్తున్న సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్, దెత్రొజ్‌లో ఉన్న గౌతమేశ్వర్ మహదేవ్ ఆలయంలో ఫిబ్రవరి 2022లో జరిగింది. ఈ సంఘటనలో దొంగలు ఇంకా పట్టుబాటలేదు అని దెత్రొజ్‌ పోలీసు వారు ఫ్యాక్ట్‌లీకి చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

వైరల్ వీడియోని వెరిఫై చేయడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 2022 నాటిది అని, ఇది గుజరాత్‌లోని ఒక గుడిలో జరిగిన ఒక దొంగతనానికి చెందిన వీడియో అని మాకు కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని దెత్రొజ్‌ తాలుక, ఓధవ్ అనే గ్రామంలో ఉన్న శ్రీ గౌతమేశ్వర్ మహాదేవ్‌జీ మందిరంలో జరిగింది (ఇక్కడ, ఇక్కడ). 4 ఫిబ్రవరి 2022 అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు ఈ గుడిలోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై ఆ గుడి పూజారి దెత్రొజ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని దివ్య భాస్కర్ పత్రిక రిపోర్ట్ చేసింది.    

ఈ కేసు గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము దాని FIR కాపీని గుజరాత్ పోలీస్ వారి అధికారిక వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసి చూడగా, అందులో ఆ నిందితుల వివరాలు లేవు అని మేము గమనించాము. మరింత సమాచారం కోసం దెత్రొజ్‌ పోలీస్ స్టేషన్ అధికారులని సంప్రదించగా, ఈ సంఘటనలో నిందితులు ఇంకా పట్టుబడలేదు అని మాకు తెలిపారు.  

అంటే, ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది కచ్‌లో ఉన్న ‘మాకేశ్వర్’(మాక్లేశ్వర్) మహాదేవ్ ఆలయంలో జరిగింది అని తప్పుగా షేర్ చేస్తున్నారు అని మనకు దీన్నిబట్టి అర్థం అవుతుంది.

ఇక కచ్‌లో ఉన్న మాక్లేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఇటువంటి దొంగతనం ఏదైనా జరిగింది అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, కచ్‌లో ఉన్న అనేక ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసులలో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు అని చెప్తున్న ఫిబ్రవరి 2022 నాటి కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

వీళ్లు దొంగతనాలు చేసిన గుళ్ళలో అంజార్ తాలూకాలో ఉన్న మాక్లేశ్వర్ మహాదేవ్ (వైరల్ పోస్టులో దీన్ని మకేశ్వర్ మహదేవ్ ఆలయం అని చెప్తున్నారు) ఆలయం ఒకటి. ఈస్ట్ కచ్ పోలీసుల ప్రకారం, ఈ ముగ్గురు నిందితుల పేర్లు ఇవి: (1) జుతుభాయి అర్జన్‌భాయ్ ఖేర్, వయస్సు 45 సంవత్సరాలు(2) సమందర్ ఖాన్ చంద్ ఖాన్ పఠాన్, 42 సంవత్సరాలు(3) కల్పేష్ ప్రకాష్‌భాయ్ నాట్, వయస్సు 40 సంవత్సరాలు. వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా వీరు ‘ముహమ్మద్, యూసుఫ్ , రజాక్’ కాదు.

అదనంగా, ఈ కేసు యొక్క వివరాలను మేము E-Courts వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసి చూడగా(Case No. 205/2022), ఈ సంఘటనలో ఈ ముగ్గురిని నిందితులుగా నిరూపించడానికి తగిన ఆధారాలు లేనందున వీరిని విడుదల చేయాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది అని మేము కనుగొన్నాము. 

చివరగా, 2022లో గుజరాత్‌లో జరిగిన రెండు వేర్వేరు దొంగతనాలను ఉటంకిస్తూ, కచ్‌లోని మాకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఇటీవల ఒక ముగ్గురు ముస్లిం వ్యక్తులు దొంగతనం చేస్తూ కెమెరాకి దొరికారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll