ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్‌లో ‘కార్పొరేట్ పన్ను 12 శాతం నుండి 7% శాతానికి తగ్గించారని’ అంటున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది.. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో కార్పొరేట్ పన్ను 12 నుండి 7 శాతానికి తగ్గించారు.
ఫాక్ట్ (నిజం): ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్‌ని తగ్గించలేదు. బడ్జెట్‌లో 12% నుండి 7%కి తగ్గించిన కో- ఆపరేటివ్ సొసైటీలపై విధించే సర్‌ఛార్జ్‌ని, కార్పొరేట్ టాక్స్ అని తప్పుగా అర్ధం చేసుకొన్నారు. ఐతే ఈ బడ్జెట్‌లో కార్పొరేట్ టాక్స్ మరియు కార్పొరేట్ సర్‌ఛార్జ్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు, అవి యధావిధంగా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని వార్తా సంస్థలు బడ్జెట్‌లో ప్రభుత్వం కార్పొరేట్ సర్‌ఛార్జ్‌ని 12% నుండి 7%కి తగ్గించింది అంటూ వార్తలు రాసాయి. ఈ వార్తా కథనాల ద్వారానే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో షేర్ అయ్యి ఉండవచ్చు.
ఐతే నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్పొరేట్ టాక్స్ గాని లేక కార్పొరేట్ సర్‌ఛార్జ్‌ని గాని తగ్గించలేదు. కార్పొరేట్ టాక్స్ మరియు కార్పొరేట్ సర్‌ఛార్జ్ గత సంవత్సరం ఎంత ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. గత సంవత్సరం (2021-22) బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ మరియు ఈ సంవత్సర (2022-23) బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్‌ను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది.
గత సంవత్సరంతో పోల్చితే కార్పొరేట్ సర్‌ఛార్జ్‌లో కూడా ఎటువంటి మారుపు లేదు.
ఐతే ఈ సంవత్సరం బడ్జెట్‌లో కో- ఆపరేటివ్ సొసైటీల (సహకార సంఘాలు) పై విధించే ఆల్టర్నేట్ మినిమం టాక్స్ రేట్‌ని 18.5% నుండి 15%కి తగ్గించింది. అలాగే కో-ఆపరేటివ్ సొసైటీలపై విధించే సర్‌ఛార్జ్‌ని 12% నుండి 7%కి తగ్గించింది. ఈ తగ్గింపు కోటి నుండి పది కోట్ల ఆదాయం ఉన్న కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తిస్తుంది. ఐతే 12% నుండి 7%కి తగ్గించిన కో- ఆపరేటివ్ సొసైటీల సర్‌ఛార్జ్‌ని, కార్పొరేట్ టాక్స్ తగ్గించినట్టు తప్పుగా అర్ధంచేసుకొని ఉండొచ్చు.
ఇలాగే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ 18% నుండి 15%కి తగ్గించిందంటూ వచ్చిన వార్తలను పీఐబీ తప్పని నిర్ధారించింది.
చివరగా, ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో 12% నుండి 7%కి తగ్గించిన కో-ఆపరేటివ్ సర్‌ఛార్జ్‌ని కార్పొరేట్ టాక్స్ తగ్గించినట్టు షేర్ చేస్తున్నారు.