సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచార కార్యక్రమంలో ప్రజలు కెమెరా ముందే అఖిలేష్ యాదవ్‌ను నిలదీసిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ‘మీరు మసీదులు కట్టండి, మసీదులకి వెళ్ళండి. ఓట్ల కోసం మాత్రమే హిందువులు కావాలా? మా ప్రాంతం నుండి మీకు ఒక్క ఓటు కూడా రాదు”, అని ప్రజలు అఖిలేష్ యాదవ్‌ను తరిమికొట్టారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సమాజ్‌వాదీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు కెమెరా ముందే అఖిలేష్ యాదవ్‌ను నిలదీసిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2019 నవంబర్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి అఖిలేష్ యాదవ్‌తో ఈవీఎం (EVM) మెషిన్ల ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు, మసీదుల నిర్మాణం గురించి కాదు. ఈవీఎం మెషిన్లను మార్చకపోతే పార్టీకి ఓట్లు పడవని, వచ్చే ఎన్నికలలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం అవుతుందని వీడియోలోని వ్యక్తి అఖిలేష్ యాదవ్‌తో చెప్పారు. ఈ వీడియోలోని వ్యక్తి అఖిలేష్ యాదవ్‌ను అవమానించే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అసలు ఈ వీడియో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినదే కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు కనీసం 2019 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి, ఈ వీడియో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించినది కాదని స్పష్టమయ్యింది. వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి అఖిలేష్ యాదవ్‌తో ఈవీఎం (EVM) మెషిన్ల ట్యాంపరింగ్ గురించి మాట్లాడినట్టు ఇవే దృశ్యాలతో ఉన్న పూర్తి వీడియోని చూస్తే తెలిసింది. ఈవీఎం మెషిన్లను మార్చకపోతే పార్టీకి ఓట్లు పడవని, వచ్చే ఎన్నికలలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం అవుతుందని వీడియోలోని వ్యక్తి అఖిలేష్ యాదవ్‌తో అన్నాడు. అఖిలేష్ యాదవ్‌ను అవమానించే విధమైన మాటలు గాని, మసీదుల నిర్మాణాల గురించి గాని ఆ వ్యక్తి మాట్లాడలేదని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.
‘మీడియా హల్చల్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియోని ఇదే వివరణతో 2019 నవంబర్ నెలలో పబ్లిష్ చేసింది.
చివరగా, ఈ వీడియోలోని వ్యక్తి అఖిలేష్ యాదవ్‌తో ఈవీఎం మెషిన్ల గురించి మాట్లాడుతున్నాడు, మసీదు కట్టడాల గురించి కాదు.