Fake News, Telugu
 

సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను తొలగించలేరు; అలాంటి చికిత్సను జే.జే.హాస్పిటల్ 5000 రూపాయిలకు అందించడం లేదు

0

కొత్త యాంజియోగ్రఫీ టెక్నాలజీ ద్వారా గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించవచ్చని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ముంబైలోని జె.జె.హాస్పిటల్‌లో ప్రస్తుతం ఈ చికిత్సను 5000 రూపాయిలకే అందిస్తున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం .     

క్లెయిమ్: గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించే సైటోస్పాంజ్ చికిత్సను ముంబైలోని జె. జె. హాస్పిటల్‌ 5000 రూపాయిలకు అందిస్తుంది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలో సైటోస్పాంజ్ పరీక్ష ద్వారా శరీరంలోని అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే గ్రహించే పద్దతిని వివరించారు. సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించవచ్చని ఈ వీడియోలో ఎక్కడా పేర్కొనలేదు. రక్తనాళాల ఆరోగ్యాన్ని మరియు వాటి ద్వారా మిగితా శరీర భాగాలకు రక్తం ఎలా ప్రవహిస్తుందో పరీక్షించడానికి యాంజియోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. CT యాంజియోగ్రఫీతో గుండెలో బ్లాకేజీ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చని కొందరు డాక్టర్లు సూచించినప్పటికి, ఈ పద్దతి ద్వారా బ్లాకేజీలను పూర్తిగా తొలగించవచ్చని ఎటువంటి వైద్య పరిశోధన తెలుపలేదు. అలాగే, జే.జే.హాస్పిటల్ లో కేవలం ఐదు వేల రూపాయలతో గుండెలోని బ్లాకేజీ తొలగించే ఎటువంటి కొత్త టెక్నాలజీ అందుబాటులో లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.      

పోస్టులో షేర్ చేసిన వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియోలో ఎక్కడ కూడా సైటోస్పాంజ్ టెక్నిక్‌ ద్వారా గుండెలోని బ్లాకేజీలను నేరుగా తొలగించవచ్చని పేర్కొనలేదని తెలిసింది. “స్ట్రింగ్ మీద ఉండే ఈ చిన్న ‘పిల్’ క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ ‘పిల్’ ఒకసారి మింగిన తరువాత పొట్టలో కరిగిపోయి, సైటోస్పాంజ్‌ను విడుదల చేస్తుంది, ఇది రోగి యొక్క ఆహార నాళం (food pipe) ద్వారా తిరిగి పైకి లాగుతారు. తద్వారా, దాదాపు అర మిలియన్ కణాలను (cells) సేకరించి అన్నవాహిక (oesophageal) క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించడానికి టెస్టుకి తీసుకెళ్తారు”, అని ఈ వీడియోలో తెలిపారు.

సైటోస్పాంజ్ పరీక్ష వల్ల అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని డాక్టర్ రిచర్డ్ డెవీస్ ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఎక్కడ కూడా హార్ట్ ఎటాక్ గురించి ప్రస్తావించలేదు. “సైటోస్పాంజ్ పరీక్ష ఎండోస్కోపీ కంటే చౌక మరియు మత్తు (sedation) అవసరం లేకుండా చేయొచ్చు. అన్నవాహిక క్యాన్సర్ యొక్క 5 సంవత్సరాల మనుగడ రేటు కేవలం 18%, అది కూడా ఆలస్యంగా నిర్ధారించడం వల్ల జరుగుతుంది.”   

సైటోస్పాంజ్ అనేది జెలటిన్ క్యాప్సూల్ (పిల్) లోపల ఉండే ఒక చిన్న మెష్ స్పాంజ్. అన్నవాహిక కణాలను సేకరించడం కొరకు ప్రైమరీ కేర్ సెట్టింగ్ ల్లో నోటి ద్వారా ఇవ్వబడుతుంది. సైటోస్పాంజ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేయబడింది. యూ.కే లో క్యాన్సర్ మరణాలకు ఏడవ అత్యంత సాధారణ కారణం అన్నవాహిక క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించినట్టైతే, దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవొచ్చు.

రక్తనాళాల ఆరోగ్యాన్ని మరియు వాటి ద్వారా మిగితా శరీర భాగాలకు రక్తం ఎలా ప్రవహిస్తుందో పరీక్షించడానికి యాంజియోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. CT యాంజియోగ్రఫీ టెక్నాలజీ ద్వారా గుండెలో బ్లాకేజీ ఎంతవరకు ఉందని తెలుసుకోవచ్చిని కొందరు డాక్టర్లు సూచించారు. కానీ, ఈ టెక్నాలజీతో గుండెలోని బ్లాకేజీలను పూర్తిగా తొలగించవచ్చని ఎటువంటి వైద్య పరిశోధనలు తెలుపలేదు. 

అలాగే, పోస్టులో చెప్పినట్టుగా జే.జే. హాస్పిటల్ లో ఐదు వేల రూపాయలతోనే గుండెలోని బ్లాకేజీ తొలగించడానికి ఏమైనా కొత్త టెక్నిక్ ఉందా అని వెతకగా, ఇలానే ఇంకో వీడియోలో ‘5000 వేల రూపాయలకే జే.జే. హాస్పిటల్ లో గుండెలోని బ్లాకేజీ తొలగింపు’ అని వచ్చిన వార్తల్లో నిజం లేదని 2015 లోనే DNA వారు మరియు గత సంవత్సరం Mumbai Live వారు ఆర్టికల్ రాసినట్టు చూడొచ్చు.

చివరగా, యాంజియోగ్రఫీ లేదా సైటోస్పాంజ్ టెక్నాలజీల ద్వారా గుండెలోని బ్లాకేజీలను తొలగించలేరు; అలాంటి ఎటువంటి చికిత్సను జే.జే.హాస్పిటల్ 5000 రూపాయలకు అందించడం లేదు.     

Share.

About Author

Comments are closed.

scroll