ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు మహిళల రక్షణ కోసం ఒక సర్వీస్ ప్రారంభించారనీ, అందులో భాగంగా ఎవరైనా తాము ప్రయాణించే కార్, క్యాబ్, ఆటో నెంబర్ ను 9969777888 కు SMS చేస్తే వారు ప్రయణం చేసే వాహనం GPRS కు అనుసంధానం అవుతుందని అని చెప్తూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు లు పెడుతున్నారు. అందులో పేర్కొన్న విషయంలో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు రాష్ట్ర మహిళల రక్షణ కోసం వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని జిపిఆర్‌ఎస్ తో ట్రాకింగ్ చేయడానికి సహాయపడే హెల్ప్‌లైన్ నంబర్– ‘9969777888’ ని ఏర్పాటు చేసారు..
ఫాక్ట్ (నిజం): హెల్ప్ లైన్ నెంబర్ – ‘9969777888’ ని 2014 లో ముంబై పోలీస్ వారు రాత్రి సమయంలో టాక్సీల్లో మరియు ఆటోల్లో ప్రయాణించే ముంబై నగర మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. కానీ, దాని సేవలను 2017లో నిలిపివేశారు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.
గత వారం శంషాబాద్ లో 27 ఏళ్ళ వెటర్నరీ డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు. అప్పటినుండి సోషల్ మీడియాలో చాలా ఫోన్ నంబర్లు మహిళలు అత్యవసర పరిస్థితుల్లో తమ రక్షణ కోసం సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అందులో భాగంగా హెల్ప్‌లైన్ నంబర్– ‘9833312222’ అనేది అత్యవసర పరిస్థితుల్లో మహిళలు సంప్రదించాల్సిన నెంబర్ అంటూ చలామణి అయింది, అప్పుడు అది తప్పు అని తెలుపుతూ ‘FACTLY’ ఒక కథనాన్ని రాసింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
అలానే పోస్టులో హెల్ప్‌లైన్ నంబర్- ‘9969777888’ ని ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు రాష్ట్ర మహిళల రక్షణ కోసం వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని GPRS ట్రాకింగ్ చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా ఆ నెంబర్ తప్పుడు సమాచారంతో వైరల్ అయినప్పుడు ‘FACTLY’ రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. వాస్తవానికి హెల్ప్ లైన్ నెంబర్ – ‘9969777888’ ని 2014 లో ముంబై పోలీస్ వారు రాత్రి సమయంలో టాక్సీల్లో మరియు ఆటోల్లో ప్రయాణించే ముంబై నగర మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. కానీ, ఆ హెల్ప్ లైన్ కి సరైన స్పందన రాకపోవడంతో దాని సేవలను 2017లో నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు హెల్ప్‌లైన్ నంబర్– ‘9969777888’ ని రాష్ట్ర మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారనే విషయం విస్తారంగా వ్యాపించడంతో డీజీపీ కార్యాలయం వారు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ పేరిట సోషల్ మీడియా లో తప్పుడు నెంబర్ లు చలామణి అవుతున్నాయని, 9969777888 నంబరు అసలు పోలీసులదే కాదు అని, అది ఫేక్ నంబర్ అని స్పష్టం చేసినట్లుగా ‘Sakshi’ వారి కథనం ద్వారా తెలిసింది.
చివరగా, హెల్ప్ లైన్ 9969777888 అనేది ముంబై పోలీసు వారు ఆ నగర మహిళల రక్షణ కోసం ప్రారంభించారు. కానీ, దాని సేవలు 2017లో నిలిపివేశారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?