Fake News, Telugu
 

షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వలేదు

0

షిర్డీ సాయిబాబా దేవుడు కాదని పేర్కొన్న ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై షిర్డీ సాయి ట్రస్ట్ మేనేజ్మెంట్ వివిధ రాష్ట్రాల కోర్టులో కేసులు వేసి ఓడారని, ఇప్పుడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువరిచింది అని, కావున తొందరలోనే అన్ని షిర్డీ సాయి దేవాలయాలు మూతబడుతాయి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులు షిర్డీ సాయిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చాయి.

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశం పై జరిగిన విచారణకు ప్రతివాదులు హాజరు కాకపోవడంతో, షిర్డీ సాయి ట్రస్ట్‌కు అనుకూలంగా భవిష్యత్తులో షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులను కోర్టు ఆదేశించింది. అలాగే ఇదే అంశంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ముందు స్వరూపానంద సరస్వతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ప్రస్తావించిన్నట్టు షిర్డీ సాయి గురించి అనుచిత వ్యాఖ్యలు (ఇక్కడ, ఇక్కడ) చేసినందుకు షిర్డీ సాయి ట్రస్ట్ మేనేజ్మెంట్ ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులుపై వివిధ రాష్ట్రాల కోర్టుల్లో వేసిన కేసుల కోసం కీవర్డ్స్ సహాయంతో వెతకగా, ఔరంగాబాద్/ జబలపుర్ కోర్టులలో ఈ విషయానికి సంబంధించిన కేసులపై విచారణ జరిగినట్టు ఎలాంటి సమాచారం లభించలేదు.

కాగా పోస్టులో చెప్తున్నట్టు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశంపై దాఖలు అయిన కేసుకి సంబంధించిన సమచారం కోసం వెతకగా, శ్రీ షిర్డీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్, దిల్‍సుఖ్‍నగర్, హైదరాబాద్ వారు 1 నవంబర్ 2016న స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులు షిర్డీ సాయి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో వారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు 4 నవంబర్ 2020న ఈ కేసులో తుది తీర్పు వెలువరించిందని తెలిసింది. ఐతే ఈ కేసులో ప్రతివాదులు హాజరు కాకపోవడంతో, షిర్డీ సాయి ట్రస్ట్‌కు అనుకూలంగా భవిష్యత్తులో షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులను కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్ట్ తీర్పు కాపీ పరిశీలించగా, ఇదే అంశంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ముందు స్వరూపానంద సరస్వతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చేపినట్టు పేర్కొన్నారు.

ఇదే విషయం గురించి మరింత సమాచారం కోసం వెతకగా, లవ్‌కుష్ విహార్ సాయి మండి వ్యవస్థాపకుడు రాజేష్ భాయ్ ఇదే అంశంలో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ విషయంపై మే 2019లో ఇండోర్ బెంచ్ విచారణ చేపట్టిన క్రమంలో సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలకు స్వరూపానంద సరస్వతి క్షమాపణలు చెప్పి, తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్  చేశాయి (ఇక్కడ, ఇక్కడ).

అంతకుముందు 2014లో ఇదే అంశంపై మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంతో సహా వివిధ ఆలయాలను నిర్వహిస్తున్న సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా, కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సాయి భక్తులు కావాలంటే స్వరూపానంద సరస్వతి పై క్రిమినల్/సివిల్ కేసు దావా వేయవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

చివరగా, షిర్డీ సాయి పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll