అక్టోబర్ 2019 లో తయారైన ఒక ‘డెటాల్’ బాటిల్ యొక్క ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, దాని మీద కొరోనా వైరస్ అని ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి కొరోనా వైరస్ ని చంపేయొచ్చని చెప్తున్నారు. అలాగే, సోషల్ మీడియా లో చాలా మంది కొరోనా వైరస్ (నోవెల్ కొరోనా వైరస్ (2019-nCoV) ని వుహాన్ లో 31 డిసెంబర్ 2019న గుర్తించారు) గురించి డెటాల్ సంస్థకి అక్టోబర్ 2019 లోనే ఎలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొరోనా వైరస్ ని డెటాల్ చంపుతుంది. కొరోనా వైరస్ గురించి ఆ సంస్థకి అక్టోబర్ 2019 లోనే తెలుసు.
ఫాక్ట్ (నిజం): డెటాల్ మీద ‘కొరోనా వైరస్’ అని పేర్కొన్నది కొరోనా వైరస్ యొక్క పాత రకాల గురించి, 2019 నోవెల్ కొరోనా వైరస్ (2019-nCoV) గురించి కాదు. అలాగే, డెటాల్ ని తయారు చేసే సంస్థ (‘RB’) కూడా వివరణ ఇస్తూ, తమ వద్ద నోవెల్ కొరోనా వైరస్ రకానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేవని, కొత్త రకం వైరస్ పై డెటాల్ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో చెప్పే స్థితిలో తాము ఇంకాలేమని చెప్పారు. కావున, పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
కొరోనా వైరస్ ని డెటాల్ చంపేస్తుంది అంటూ వస్తున్న వార్తల గురించి గూగుల్ లో వెతికినప్పుడు, డెటాల్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో, దానిని తయారు చేసే సంస్థ అయిన RB (Reckitt Benckiser) ఒక వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. ‘Livemint’ కథనం ప్రకారం, ఆ సంస్థ తమ వివరణలో నోవెల్ కొరోనా వైరస్ రకానికి సంబంధించిన మరిన్ని వివరాలు తమ వద్ద లేవని, కొత్త రకం వైరస్ పై డెటాల్ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో చెప్పే స్థితిలో ఇంకా తాము లేమని చెప్పారు.
WHO వెబ్సైటు ద్వారా నోవెల్ కరోనావైరస్ (2019-nCoV) అనేది కరోనా వైరస్ యొక్క కొత్త రకం అనీ, 2019 డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో వ్యాప్తి చెందడంతో గుర్తించినట్లుగా తెలుస్తుంది. కావున, డెటాల్ మీద ‘కొరోనా వైరస్’ అని పేర్కొన్నది కొరోనా వైరస్ యొక్క పాత రకాల గురించి, 2019 నోవెల్ కొరోనా వైరస్ (2019-nCoV) గురించి కాదు. కొరోనా వైరస్ యొక్క పాత రకాల గురించి మరియు ఇప్పటి కొత్త రకం ‘2019-nCoV’ గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ‘డెటాల్’ మీద ‘కొరోనా వైరస్’ అని పేర్కొన్నది ‘నోవెల్ కొరోనా వైరస్ (2019-nCoV)’ గురించి కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?