Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, SC, ST, OBC, మైనారిటీ న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చింది

0

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హైకోర్టులు, సుప్రీం కోర్టులో ముస్లిం న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చినట్టు చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హైకోర్టులు, సుప్రీం కోర్టులో ముస్లిం న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చింది.

ఫాక్ట్(నిజం): కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామనే కాకుండా మహిళలు, SC, ST, OBC, మైనారిటీ న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ‘న్యాయపత్రం’ పేరిట మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘న్యాయపత్ర’ పేరుతో మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది (ఇక్కడ & ఇక్కడ). ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించారు.

ఈ మేనిఫెస్టోలో న్యాయవ్యవస్థకు సంబంధించి కూడా ఆరు హామీలు ఇచ్చింది. జాతీయ న్యాయ కమిషన్ ఏర్పాటు చేయడం, హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లోని ఖాళీలన్నీ మూడేళ్లలోపు భర్తీ చేయడం, న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తగినంత నిధులను కేటాయించడం, మొదలైన హామీలు ఇచ్చింది.

ఇందులో భాగంగానే హైకోర్టులు, సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామన్న హామీ కూడా ఇచ్చింది. మహిళలు, SC, ST, OBC, మైనారిటీ న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని ఈ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కేవలం ముస్లిం న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని మాత్రమే చెప్పలేదు. కాంగ్రెస్ ప్రచారంలో కూడా ఇలాంటి హామీ ఇచ్చినట్టు కూడా రిపోర్ట్స్ లేవు. దీన్నిబట్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీను వక్రీకరించినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, SC, ST, OBC, మైనారిటీ న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చింది.

Share.

About Author

Comments are closed.

scroll