Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంత తక్కువ పోలియో టీకాలు వేసిందన్న వాదనలో నిజం లేదు

0

బీజేపీ ప్రభుత్వం 6 నెలల్లో 65 కోట్ల కోవిడ్ టీకాలు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళలో ఇన్ని పోలియో టీకాలు కూడా వేయలేదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళలో కనీసం 65 కోట్ల పోలియో టీకాలు కూడా వేయలేదు.

ఫాక్ట్ (నిజం): నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం 2004 -12 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం NIDs మరియు SNIDs ద్వారా 600 కోట్లకు పైచిలుకు పోలియో టీకాలను వేసింది. ఈ సంవత్సరాలలో ఒక్కరోజే 17 కోట్లకు పైగా టీకాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత ప్రభుత్వం 1978లో ‘ఎక్సపాండెడ్ ప్రోగ్రాం ఆన్ ఇమ్మునైజేషన్’ అనే కార్యక్రమం ద్వారా దేశంలో పోలియో వాక్సిన్లను ఇవ్వడం ప్రారంభించింది. ఆ తరవాత 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఐతే  1988లో ప్రపంచ వ్యాప్తంగా పోలియోని నిర్మూలించాలని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ  చేసిన తీర్మానానికి కట్టుబడి భారత ప్రభుత్వం1995లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే పేరుతో పూర్తి స్థాయి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దీనిలో భాగంగా ‘నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్’ (NIDs) / ‘పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్’ అనే ఒక ప్రత్యేక పోలియో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరానికి రెండుసార్లు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి బిడ్డకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ (OPV) అందిస్తుంది, సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇన్ఆక్టివేట్డ్ పోలియో వ్యాక్సిన్ (IPV)ని అందిస్తుంది. అదనంగా పోలియో తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ (SNID) ద్వారా పోలియో టీకాలు అందించడం ప్రారంభించింది.

ఈ పోలియో వాక్సినేషన్‌కి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ వెబ్సైటులో 2001-12 వరకు ప్రతీ సంవత్సరం NIDs మరియు SNIDs ద్వారా అందించిన పోలియో టీకాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచారంలో నుండి కేవలం 2004-12 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంవత్సరాలలో అందించిన పోలియో టీకాల వివరాలను పరిగణలోకి తీసుకుంటే ఈ అన్ని సంవత్సరాలను కలుపుకొని 600కోట్లకు పైగా టీకాలను అందించారు. ఈ సంవత్సరాలలో ఒక్కరోజే 17 కోట్లకు పైగా టీకాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైరల్ పోస్టులో చెప్తునట్టు మోదీ ప్రభుత్వం కరోనా టీకాల వివరాలు నిజమైనప్పటికి, కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులో చెప్తున్న అంకెల కంటే తక్కువ పోలియో టీకాలు వేసిందన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

చివరగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంత తక్కువ పోలియో టీకాలు వేసిందన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll