Fake News, Telugu
 

వేరు వేరు సందర్భాల్లోని సావర్కర్, నెహ్రూ, గాంధీ జైలు గదుల ఫోటోలని పోలుస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు

0

వీర సావర్కర్ (27 సంవత్సరాలు), నెహ్రూ (9 సంవత్సరాలు) మరియు గాంధీ (6 సంవత్సరాలు) ఉన్న జైలు గదుల ఫోటోలని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. నెహ్రూ మరియు గాంధీ ఉన్న గదులకు మరియు సావర్కర్ ఉన్న గదికి తేడా గమనించవచ్చని పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: వీర సావర్కర్ (27 సంవత్సరాలు), నెహ్రూ (9 సంవత్సరాలు) మరియు గాంధీ (6 సంవత్సరాలు) ఉన్న జైలు గదుల ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ప్రదేశాలు – సెల్యూలర్ జైలు (సావర్కర్ ఉన్నది 1911-21 మధ్యలో), అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలు (నెహ్రూ ఉన్నది 1942-45 మధ్యలో), మరియు ఆగా ఖాన్ ప్యాలెస్ (గాంధీ ఉన్నది 1942-44 మధ్యలో). పోస్ట్ లో ఇచ్చిన సంవత్సరాల వివరాలు తప్పు. అంతేకాదు, పోస్ట్ లో ఇచ్చిన నెహ్రూ మరియు గాంధీ జైలు గదులను సావర్కర్ ఉన్న జైలు గదితో పోల్చలేము. ఎందుకంటే సావర్కర్ తప్పించుకోవడానికి ఒకసారి ప్రయత్నించారని, మరియు 50 ఏళ్ళ శిక్ష పడినందున సెల్యూలర్ జైల్లో ఉంచారు. కానీ, నెహ్రూ మరియు గాంధీలకు అలాంటి శిక్ష పడ లేదు, కేవలం క్విట్ ఇండియా ఉద్యమం సందర్బంగా వారిని అరెస్ట్ చేసారు. కావున, పోస్ట్ లో వేరు వేరు సందర్భాల్లోని ఫోటోలని పోలుస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఒక్కో లీడర్ ని తీసుకొని, అతనికి సంబంధించి పోస్ట్ లో ఇచ్చిన ఫోటో గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

సావర్కర్:

పోస్ట్ లోని ఫోటోలో ఉన్న జైలు గది అండమాన్ లోని సెల్యూలర్ జైలు లో సావర్కర్ ని ఉంచిన జైలు గది లాగానే ఉన్నట్టు గూగుల్ మాప్స్ లోని ఫోటోలల్లో గమనించవొచ్చు. అండమాన్ లోని సావర్కర్ జైలు గది కి సంబంధించిన మరి కొన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. సావర్కర్ అరెస్ట్ కు సంబంధించిన కేసు వివరాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

అయితే, అండమాన్ లోని సెల్యూలర్ జైలు గదిలో సావర్కర్ ని 1911 నుండి 1921 వరకు (అంటే సుమారు పది సంవత్సరాలు) ఉంచినట్టు మరో ఫోటోలో చూడవొచ్చు. 1921 లో తనను రత్నగిరికి, ఆ తరువాత 1923 లో ఎరవాడ జైలుకు పంపిచినట్టు సావర్కర్ తన పుస్తకంలో రాసాడు. చివరగా, తను 1924 లో విడుదల అయినట్టు తెలిసింది. ఇదే విషయం రాజ్యసభ టీవీ వెబ్ సైట్ ఆర్టికల్ లో మరియు లోక్ సభ డాక్యుమెంట్ లో చదవొచ్చు.  కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు 27 సంవత్సరాలు సావర్కర్ అండమాన్ లోని సెల్యూలర్ జైలు గది లో లేడు.

నెహ్రూ:

పోస్ట్ లోని ఫోటో అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలు లో నెహ్రూ ని ఉంచిన గది ఫోటోనేనని ఇక్కడ చూడవొచ్చు. అహ్మద్‌నగర్ ఫోర్ట్ కి సంబంధించిన ఒక వీడియోలో కూడా ఫోటోలోని గదిని చూడవొచ్చు.

నెహ్రూ సుమారుగా 9 ఏళ్ళు జైలులో ఉన్నట్టు ‘నెహ్రూ పోర్టల్’ వెబ్సైటులో చూడవొచ్చు. అయితే, ఆ 9 ఏళ్ళల్లో ఫోటోలో ఇచ్చిన అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలులో మాత్రం కేవలం 1942-45 మధ్యనే ఉన్నాడు. వివిధ సమయాల్లో, వేరు వేరు ప్రదేశాలలోని అనేక జైలల్లో నెహ్రూ ని బ్రిటిష్ వారు ఉంచారు. వాటి వివరాలు ఇక్కడ చదవొచ్చు.

గాంధీ:

గాంధీ కి సంబంధించి పోస్ట్ లో ఇచ్చిన ఫోటో ఆగా ఖాన్ ప్యాలెస్ లో తీసింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్బంగా గాంధీ ని 1942-44 మధ్య అక్కడ ఉంచినట్టు  తెలిసింది.

వివిధ సమయాల్లో గాంధీ ని అరెస్ట్ చేసి ఉంచిన ప్రదేశాల వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ లో ఇచ్చిన నెహ్రూ మరియు గాంధీ గదులను సావర్కర్ ఉన్న జైలు గదితో పోల్చలేము. ఎందుకంటే సావర్కర్ తపించుకోవడానికి ఒకసారి ప్రయత్నించారని మరియు 50 ఏళ్ళ శిక్ష పడినందున సెల్యూలర్ జైల్లో ఉంచారు. కానీ, నెహ్రూ మరియు గాంధీలకు అలాంటి శిక్ష పడ లేదు, కేవలం క్విట్ ఇండియా ఉద్యమం సందర్బంగా వారిని అరెస్ట్ చేసారు. నెహ్రూ మరియు గాంధీ లనే కాదు, పటేల్, మౌలాన, అసఫ్ అలీ వంటి నాయకులను కూడా అలాంటి జైళ్లలోనే ఉంచారు.

చివరగా, వేరు వేరు సందర్భాల్లోని సావర్కర్, నెహ్రూ మరియు గాంధీ జైలు గదుల ఫోటోలని పోలుస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll