Fake News, Telugu
 

తెలంగాణతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాల ద్వారా తమ సొంత టాక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం ఆర్జిస్తోంది

0

Update (26 April 2023):

తెలంగాణ ఎక్సైజ్ రెవెన్యూకు సంబంధించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మహారాష్ట్ర & గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం ఎక్కువని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ రెవెన్యూ 43.4% అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు మహారాష్ట్ర & గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ రెవెన్యూ ఎక్కువే, కాని తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ రెవెన్యూ పోస్టులో చెప్పినంత ఎక్కువ లేదు.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ టాక్స్ వాటా 18.3% మాత్రమే. ఇదే సంవత్సరానికి మహారాష్ట్రలో ఎక్సైజ్ టాక్స్ వాటా సుమారు 8% కాగా, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇది నామమాత్రంగానే ఉంది. గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉండడం వల్ల ఆ రాష్ట్రంలో ఎక్సైజ్ రెవెన్యూ తక్కువగా ఉంది.

ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్సైజ్ రెవెన్యూ ఎక్కువన్న వాదన కూడా కరెక్ట్ కాదు. కింద ఇచ్చిన గ్రాఫ్ బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్, కర్నాటక మరియు ఉత్తరఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో  ఎక్సైజ్ రెవెన్యూ తెలంగాణ కన్నా ఎక్కువగా ఉంది.

Published (30 March 2023):

తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మద్యం ఆదాయాన్ని పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘25 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 40 వేల కోట్లు కాగా, 3.5 కోట్ల జనభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మద్యం నుండి వచ్చే ఆదాయం 45 వేల కోట్లు’ అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 40 వేల కోట్లు కాగా, 3.5 కోట్ల జనభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మద్యం నుండి వచ్చే ఆదాయం 45 వేల కోట్లు.

ఫాక్ట్(నిజం):  తెలంగాణా కన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాలపై ఎక్కువగా ఆధార పడుతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ రెవెన్యూ వాటా 22.6% కాగా, తెలంగాణలో ఎక్సైజ్ రెవెన్యూ వాటా 18.3% మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా సమకూర్చుకునే  ఆదాయంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఎక్సైజ్ రెవిన్యూ వాటా ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ సోషల్ మీడియా పోస్టులో తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మద్యం ఆదాయాన్ని పోల్చడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా మద్యం నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడుతుంది చెప్పే ప్రయత్నం చేసారు.

కాని అధికారిక డేటా ప్రకారం తెలంగాణ కన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రామే ఎక్కువగా ఎక్సైజ్ రెవెన్యూపై (మద్యం అమ్మకాలపై విధించే పన్ను) ఆధార పడుతుంది. ఐతే తెలంగాణ/ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎక్సైజ్ రెవెన్యూకు సంబంధించి పోస్టులో షేర్ చేసిన గణాంకాలు మాత్రం పూర్తిగా తప్పు.

తెలంగాణ కన్నా ఉత్తరప్రదేశ్ ఎక్సైజ్ రెవెన్యూ ఎక్కువ:

RBIలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ డేటా ప్రకారం, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయ వనరులలో 22.6% ఎక్సైజ్ టాక్స్ నుండే ఆర్జించింది.

ఈ సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయ వనరుల విలువ 1.6లక్షల కోట్లుకు పైచిలుకు కాగా, ఇందులో 36వేల కోట్లుకు పైచిలుకు (22.6%) ఎక్సైజ్ నుండే  ఆర్జించింది.

ఐతే ఇదే ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ టాక్స్ వాటా 18.3%గా ఉంది. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయ వనరుల విలువ సుమారు 93 వేల కోట్లు కాగా, ఇందులో ఎక్సైజ్ రెవెన్యూ వాటా 17వేల కోట్లు (18.3%).

ఎక్సైజ్ రెవిన్యూ వాటా ఎక్కువగా ఉన్న రాష్టాలలో ఉత్తరప్రదేశ్‌ది మొదటి స్థానం:

RBI డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా సమకూర్చుకునే  ఆదాయంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఎక్సైజ్ రెవిన్యూ వాటా ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం(ఎక్కువ జనాభా) కాబట్టి సహజంగానే దాని ఎక్సైజ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కాని దాని సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ రెవెన్యూ వాటా ఎక్కువ ఉండటాన్ని గమనిస్తే, తెలంగాణ కన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాలపై ఎక్కువగా  ఆధార పడుతుందన్న విషయం స్పష్టమవుతుంది.

చివరగా, తెలంగాణతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాలపై ఎక్కువగా ఆధార పడుతోంది.

Share.

About Author

Comments are closed.

scroll