Fake News, Telugu
 

చైనాలో కూడా ‘MSG’ని (అజినోమోటో) వాడుతారు; ‘MSG’ని ఎరువుల పేరు మీద మన దేశం దిగుమతి చేయట్లేదు

0

మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టేస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి. ఈ టెస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి ఫర్టిలైజర్స్ పేరు మీద మన దేశానికి వస్తుంది. ఇది తినే ఆహార విషెస్ సూచికలో లేదు. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి రోగిష్ఠులు చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన ఫోటో చూస్తే, వారు మాట్లాడుతున్నది మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో (‘MSG’ అనేది ఆ వస్తువు పేరు. దానిని ఎక్కువగా తయారు చేసే జపానీస్ కంపెనీ పేరు అజినోమోటో) గురించి అని తెలుస్తుంది. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చైనా నుంచి ఎరువుల పేరు మీద మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో మన దేశానికి వస్తుంది. చైనాలో అది వాడితే ఉరిశిక్ష విధిస్తారు, కానీ భారతదేశ ప్రజలు అనారోగ్యం పాలవాలని కావాలనే మనకు పంపిస్తున్నారు.

ఫాక్ట్: ‘మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో’ పేరు మీదనే దానిని వివిధ దేశాల నుండి (చైనా నుండి కూడా) భారతదేశం దిగుమతి చేసుకుంటున్నట్టు ‘Department of Commerce’ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. చైనాలో దానిని ఎక్కడ వాడినా ఉరిశిక్ష విధిస్తారనేది కూడా తప్పు. అంతేకాదు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మొత్తంలో ‘MSG’ వినియోగించే దేశమని కొన్ని ప్రైవేట్ రిపోర్టుల్లో చూడవచ్చు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, చైనా నుంచి ఎరువుల పేరు మీద మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో మన దేశానికి వస్తుందని ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. ‘మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో’ పేరు  మీదనే దానిని వివిధ దేశాల నుండి (చైనా నుండి కూడా) భారతదేశం దిగుమతి చేసుకుంటున్నట్టు ‘Department of Commerce’ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అంతేకాదు, కొంత ‘మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో’ని భారతదేశం కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. 

చైనా మొత్తంలో మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటోని ఎక్కడ వాడినా ఉరిశిక్ష విధిస్తారనేది కూడా తప్పు. అలాంటి చట్టం ఒకటి ఉన్నట్టు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. అంతేకాదు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మొత్తంలోMSG’ వినియోగించే దేశమని కొన్ని ప్రైవేట్ రిపోర్టుల్లో చూడవచ్చు.

తగిన మొత్తంలో మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటోని వాడితే ఎటువంటి ఇబ్బంది ఉందని వివిధ దేశాలకు సంబంధించిన అధికారిక ఆహార నియంత్రణ సంస్థల వెబ్‌సైట్‌లలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చదవచ్చు.

అయితే, ‘FSSAI (LABELLING AND DISPLAY) REGULATIONS’ ప్రకారం తినే పదార్థాల్లో MSG ఉంటే, ఆ ప్యాకెట్ మీద  ఆ ఆహారంలో ‘MSG’ ఉందని మరియు 12 నెలల లోపు శిశువులు మరియు గర్భిణీల కోసం సిఫార్సు చేయబడలేదని (“This package of (name of the food) …………… contains added MONOSODIUM GLUTAMATE. NOT RECOMMENDED FOR INFANTS BELOW -12 MONTHS AND PREGNANT WOMEN”) రాసి ఉండాలి. అంతేకాదు, ‘MSG’లో అధిక సోడియం ఉంటుందని, కావున రోజువారీ వంటలలో దానిని ఉపయోగించడం మానుకోవడం మంచిదని ‘Eat Right India’ వెబ్‌సైట్‌లో చదవచ్చు. ‘MSG’కి  సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, చైనాలో కూడా ‘MSG’ని (అజినోమోటో) వాడుతారు; ‘MSG’ని ఎరువుల పేరు మీద భారతదేశం దిగుమతి చేయట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll