Fake News, Telugu
 

వోటర్ జాబితాని ఆధార్‌తో లింక్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు

0

‘దేశవ్యాప్తంగా ఓటును ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు ప్రకటించిన కేంద్రం’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘దేశవ్యాప్తంగా ఓటును ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు ప్రకటించిన కేంద్రం’.

ఫాక్ట్(నిజం): లోక్ సభలో ఎలక్టోరల్ రోల్స్‌ని (ఓటర్ జాబితా) ఆధార్‌తో అనుసంధానించే ప్రతిపాదనకి సంబంధించి ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు జవాబిస్తూ ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అంతేగాని, ఓటర్ జాబితాను ఆధార్‌తో లింక్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

04 ఆగస్టు 2021నాడు లోక్ సభలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం ఎలక్టోరల్ రోల్స్‌ని (ఓటర్ జాబితా) ఆధార్‌తో అనుసంధానించే ప్రతిపాదనకి సంబంధించి ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు జవాబిస్తూ ఒకే వ్యక్తి వేరు వేరు చోట్ల ఒకటి కంటే ఎక్కువ సార్లు వోటుని నమోదు చేసుకొనే సమస్యని అరికట్టాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్స్‌ని ఆధార్‌తో అనుసంధానించాలానే ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని, ఐతే ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.

ఐతే కేంద్ర మంత్రి లోక్ సభలో ఇచ్చిన ఈ జవాబుని కొందరు తప్పుగా అర్ధం చేసుకొని కేంద్రం ప్రభుత్వం ఓటును ఆధార్‌తో లింక్ చేస్తునట్టు ప్రకటించిందని ప్రచారం చేస్తున్నారు. కాని పైన తెలిపిన జవాబులో కేంద్ర మంత్రి స్పష్టంగా ఈ ప్రతిపాదనని పరిశీలిస్తున్నామని అని అన్నాడే తప్ప, అనుసంధానించబోతున్నట్టు చెప్పలేదు. దీని మీద కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఎలక్టోరల్ రోల్స్‌ని ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ మొదలు కావట్లేదని అర్ధం చేసుకోవచ్చు.

ఆధార్‌తో అనుసంధానించబడిన కేంద్ర ప్రభుత్వ పథకాలు/సేవలు:

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలను లేదా అందిస్తున్న సేవలను పొందేందుకు లబ్దిదారుల/వినియోగదారుల ఆధార్‌ వివరాలను ప్రామాణికంగా పరిగణిస్తున్నాయి. రైల్వే టికెట్ బుకింగ్, పాస్పోర్ట్ అప్లికేషనుకి సంబంధించి eKYC మొదలైన కేంద్ర ప్రభుత్వం అందించే సేవలలో ఆధార్‌ వివరాలను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సేవల వివరాలను ఇక్కడ చూడొచ్చు. ఐతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సేవలు పొందడానికి ఆధార్‌ వివరాలను అందించడం తప్పనిసరేమి కాదు. ఆధార్‌ వివరాలను అందించాలో లేదో అన్నది పూర్తిగా వినియోగదారుడు నిర్ణయించుకోవచ్చు. పలు రాష్ట్రాలు కూడా ప్రభుత్వం అందించే సేవలను పొందేందుకు ఆధార్‌ వివరాలను ప్రామాణికంగా పరిగణిస్తున్నాయి.

 సుప్రీం కోర్టు అభిప్రాయం:

2015లో ఓటరు జాబితాలో పొరపాట్లను సవరించే నేపథ్యంలో వోటర్ జాబితాని ఆధార్ వివరాలతో అనుసంధించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే NERPAP (National Electoral Rolls Purification & Authentication Program) అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఐతే ప్రభుత్వ పథకాలు అందించడానికి ఆధార్‌ని తప్పనిసరి చేయొద్దని అంతకుముందు పలు సందర్భాలలో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 2015లో కూడా మళ్ళీ ఇదే అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం వోటర్ జాబితాని ఆధార్ వివరాలతో అనుసందించాలని ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఈ విషయానికి సంబంధించి గతంలో FACTLY వివరంగా రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, వోటర్ జాబితాని ఆధార్‌తో అనుసందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు, కేవలం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం అని చెప్పింది.

Share.

About Author

Comments are closed.

scroll