Fake News, Telugu
 

2021లో చైనా నుండి భారత్ కి దిగుమతులు పెరగడంతో పాటు, భారత్ నుండి చైనాకి ఎగుమతులు కూడా పెరిగాయి

0

‘2021లో చైనా నుండి భారత్ కి దిగుమతులు పెరగగా, భారత్ నుండి చైనాకి ఎగుమతులు మాత్రం తగ్గాయని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2021లో భారత్ నుండి చైనాకి ఎగుమతులు 90.2% తగ్గాయి.

ఫాక్ట్ (నిజం): చైనీస్ కస్టమ్స్ డేటా ప్రకారం 2021లోని మొదటి ఐదు నెలలలో భారత్, చైనాల మధ్య వాణిజ్యం 70.1 శాతం పెరిగి 48.16 బిలియన్ డాలర్స్ కి చేరుకుంది. ఐతే ఇదే కాలానికి చైనా నుండి భారత్ కి దిగుమతులు 64.1% పెరగగా, భారత్ నుండి చైనాకి ఎగుమతులు కూడా 90.2 % పెరిగాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

చైనీస్ కస్టమ్స్ డేటా ఆధారంగా 2021లోని మొదటి ఐదు నెలలలో భారత్, చైనాల మధ్య వాణిజ్యం 70.1 శాతం పెరిగి 48.16 బిలియన్ డాలర్స్ కి చేరుకుందని చెప్తూ చైనాకి చెందిన ప్రముఖ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో భారత్ మరియు చైనాల మధ్య జరిగిన వాణిజ్య వివరాలు కూడా ప్రచురించింది, పోస్టులో చెప్తున్న వివరాలు ఈ కథనంలో నుండి సేకరించినవే.

ఐతే ఈ కథనం ప్రకారం 2020వ సంవత్సరంలో జనవరి – మే మధ్య కాలంతో పోలిస్తే 2021లో ( జనవరి – మే) చైనా నుండి భారత్ కి దిగుమతులు 64.1% పెరిగినట్టు తెలుస్తుంది. ఇదే సమయానికి భారత్ నుండి చైనాకి ఎగుమతులు కూడా 90.2 % పెరిగినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు. ఐతే దీనినే భారత్ నుండి చైనాకి ఎగుమతులు 90.2 % తగ్గినట్టు షేర్ చేస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ చైనా నుండి వైద్య పరికరములు దిగుమతి చేసుకోవడం ఇలా వాణిజ్యం పెరగడానికి ఒక కారణమై ఉండొచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు. పైగా ఈ కథనం ప్రకారం 2020లో చైనా, అమెరికాని దాటేసి 86.4 బిలియన్ డాలర్స్ తో భారత్ యొక్క అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. ఐతే భారత ప్రభుత్వం యొక్క కామర్స్ మినిస్ట్రీ తరపు నుండి ప్రస్తుతానికి భారత్ – చైనాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఫిబ్రవరి 2021 వరకు మాత్రమే డేటా అందుబాటులో ఉంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం ఆధారంగా ఇతర వార్తా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలలో కూడా భారత్ నుండి చైనాకి ఎగుమతులు పెరిగినట్టు రాసుంది.

చివరగా, 2021లో చైనా నుండి భారత్ కి దిగుమతులు పెరగడంతో పాటు, భారత్ నుండి చైనాకి ఎగుమతులు కూడా పెరిగాయి.

Share.

About Author

Comments are closed.

scroll